Site icon NTV Telugu

Deep Sidhu : యాక్సిడెంట్… రైతు నిరసనతో వార్తల్లో నిలిచిన నటుడి మృతి

Deep Sidhu

రైతుల నిరసనల సందర్భంగా ప్రధాన వార్తల్లో నిలిచిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం యాక్సిడెంట్ కారణంగా కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన నడుపుతున్న తెల్లటి స్కార్పియో వాహనం, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా పిలువబడే వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై హర్యానాలోని ఖర్ఖోడా సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దీప్ సిద్ధూ నటి, స్నేహితురాలు రీనా రాయ్‌తో కలిసి ఢిల్లీ నుండి బటిండాకు ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు ప్రకటించారు. అయితే రీనా రాయ్ మాత్రం ప్రమాదం నుండి బయటపడింది.

Read Also : Bappi Lahiri : కొడుకు రాకకై ఎదురు చూపులు… అంత్యక్రియలు ఎప్పుడంటే ?

ఇక పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ దీప్ సిద్ధూ కుటుంబానికి సంతాపం తెలిపారు. “ప్రఖ్యాత నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబ సభ్యులు, అభిమానులతో ఉన్నాయి” అని సీఎం చన్నీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీప్ సిద్ధూకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా మారిన రైతు కార్యకర్త గత సంవత్సరం జనవరి 26 న జాతీయ రాజధానిలో రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నందుకు వార్తల్లో నిలిచాడు, ఇది హింసాత్మకంగా మారింది, చాలా మంది గాయపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గణతంత్ర దినోత్సవ ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి దీప్ సిద్ధూను హర్యానాలోని కర్నాల్ నుండి గత ఏడాది ఫిబ్రవరి 9న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై దాడి చేసేందుకు దీప్ సిద్ధూ రైతులను రెచ్చగొడుతున్నాడని పోలీసులు తెలిపారు. అప్పట్లో ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధూపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేశారు. దీప్ సిద్ధూకు ఏప్రిల్ 17న బెయిల్ మంజూరైంది.

అయితే ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాకాండ సందర్భంగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మరో కేసులో అదే రోజు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు ఏప్రిల్ 26న బెయిల్ మంజూరైంది. ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనకు సంబంధించి గతేడాది మేలో దీప్ సిద్ధూపై ఢిల్లీ పోలీసులు 3,224 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ లో మరణించడంపై అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version