కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని వదిలివెళ్లి వారం దాటింది. అయినా ఆ విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన హఠాన్మరణం విన్న అభిమానులలో కొంతమంది గుండె ఆగిపోయింది. ఇంకొంతమంది తమ అభిమాన హీరో లేనప్పుడు మేము ఎందుకు అంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ అభిమానుల ఆత్మహత్యలపై పునీత్ రాజ్ కుమార్ భార్య శ్రీమతి అశ్విని స్పందించారు. ఇలా అఘాయిత్యాలకు ఎవరు పాల్పడవద్దని ఆమె కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు.
“పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు.. అప్పు లేడన్న విషయం మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం.. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఈ ఎనలేని ప్రేమకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆయన మన మధ్యలేకపోయినా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆయనే లేని లోటును మేము అనుభవిస్తున్నాం.. మీ కుటుంబాలకు అలంటి పరిస్థితి రానివ్వకండి. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయకండి. దయచేసి ప్రతి ఒక్కరు దైర్యంగా ఉండండి.. ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు” అంటూ విజ్ఞప్తి చేశారు. ఇకపోతే అటు అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంత్యక్రియలకు రాని ప్రముఖులు ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తున్నారు.
