NTV Telugu Site icon

Nagireddy: కార్యదక్షుడు ‘విజయా’ నాగిరెడ్డి

Producer Nagireddy

Producer Nagireddy

Nagireddy: విజయా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన – “షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ, సి.ఐ.డి” చిత్రాలను ‘నవరత్నాలు’ అనేవారు సినీజనం. ఈ చిత్రాలన్నిటా యన్.టి.రామారావు కథానాయకునిగా నటించారు. ఈ సినిమాల టైటిల్స్ కార్డ్స్ లో తెరపై నిర్మాతలుగా నాగిరెడ్డి – చక్రపాణి పేర్లు కనిపించగానే జనాలు ఈలలు వేసేవారు, చప్పట్లు కొట్టేవారు. అంతలా తెలుగువారిని అలరించిన నిర్మాతలు ఆ ఇద్దరు మిత్రులు. ఒకే ఆత్మ రెండు శరీరాలుగా నాగిరెడ్డి, చక్రపాణి మసలుకున్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. చక్రపాణిది ఆలోచన అయితే, దానిని ఆచరించడంలో నాగిరెడ్డి మేటిగా నిలిచేవారు. వారి చిత్రాల ద్వారా ఈ ఇద్దరు మిత్రుల పేర్లు నవతరం వారినీ ఆకర్షిస్తున్నాయి. చేతల్లో తనదైన బాణీ పలికించిన నాగిరెడ్డి జనం చేత ‘కార్యదక్షుడు’ అని జేజేలు అందుకున్నారు.

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912 డిసెంబర్ 2న కడప జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో జన్మించారు. ఆయన అన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి చిత్రసీమలో బి.యన్.రెడ్డిగా సుప్రసిద్ధులు. బి.యన్. రెడ్డి దర్శకనిర్మాతగా సాగుతున్న సమయంలో నాగిరెడ్డి, తన తండ్రి వద్ద ఉంటూ వ్యాపారం చూసుకొనేవారు. ఆ వ్యవహారాలు చూసుకుంటూనే తన అభిరుచికి తగ్గట్టుగా ‘ఆంధ్రజ్యోతి’ అనే పత్రికను నడిపారు. తరువాత అన్న బి.యన్.రెడ్డి చిత్రాలకు ప్రచారకర్తగా పలు కొత్త పుంతలు చూపారు. ఓ సినిమా ఓ ఊరిలో ఆడుతూ ఉంటే, ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎడ్ల బండ్లు కట్టి, వాటికి సదరు సినిమాల పోస్టర్స్ అతికించి ప్రచారం చేయించేవారు. అదే పంథాను తరువాతి రోజుల్లో అందరూ అనుసరించడం విశేషం. నాగిరెడ్డికి మద్రాసులోనే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అక్కడకు చక్రపాణి తన రచనలు అచ్చు వేయించుకోవడానికి వచ్చేవారు. అలా వారిద్దరి మధ్య స్నేహబంధం కుదిరింది. అది అనతికాలంలోనే బలపడింది. ఇద్దరి అభిరుచులూ కలిశాయి. సాహిత్యం, సినిమాలపై చర్చించుకుంటూ ఉండేవారు. వారిద్దరూ కలసి ‘చందమామ’ బాలల పత్రికను స్థాపించారు. 1947లో మొదలైన ‘చందమామ’ తరువాతి కాలంలో ఆబాలగోపాలాన్నీ విశేషంగా ఆకట్టుకుంది. 14 భాషల్లో ‘చందమామ’ వెలుగు చూసింది.

నాగిరెడ్డి కూతురు విజయ పేరు మీద విజయా ప్రొడక్షన్స్ నెలకొల్పారు నాగిరెడ్డి, చక్రపాణి. తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని నాగిరెడ్డి, చక్రపాణి తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ నిర్మించారు. ఈ నాటికీ ‘షావుకారు’ చిత్రం జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంది. దీని తరువాత ఆ రోజుల్లో భారీగా నిర్మించిన ‘పాతాళభైరవి’ జానపదం తెలుగు చిత్రసీమలో తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలచింది. ‘పాతాళభైరవి’ని తమిళంలోనూ తెరకెక్కించారు. అప్పటి నుంచీ విజయా సంస్థ నిర్మించే చిత్రాలను ద్విభాషల్లో రూపొందించేవారు. విజయా సంస్థ తెలుగులో నిర్మించిన తొలి రంగుల చిత్రం ‘గంగ-మంగ’. తరువాత చక్రపాణి దర్శకత్వంలో ‘శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ నిర్మించడం ఆరంభించారు. నిర్మాణం ఆరంభం కాగానే చక్రపాణి కన్నుమూశారు. బాపు ఆ సినిమాను పూర్తి చేశారు. మిత్రుడు చక్రపాణి మరణం, నాగిరెడ్డిని కలచి వేసింది. ఆ తరువాత తెలుగులో ఆయన చిత్రాలు నిర్మించలేదు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నాగిరెడ్డి ఉన్న సమయంలోనే ‘వైకుంఠం క్యూ కాంప్లెక్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1972లో ‘విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు నాగిరెడ్డి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మద్రాసులో విజయా హాస్పిటల్, విజయ హెల్త్ కేర్ సెంటర్, విజయా హార్ట్ ఫౌండేషన్ సాగుతున్నాయి. చిత్రసీమకు నాగిరెడ్డి అందించిన సేవలకు 1986లో భారత ప్రభుత్వం ఆయనను ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’తో గౌరవించింది. ఆ తరువాత 1987లో నాగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సన్మానించింది. ఆయన తనయులు వెంకట్రామిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే కొన్ని చిత్రాలు నిర్మించారు. 2004 ఫిబ్రవరి 25న నాగిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన నిర్మాతగా యన్టీఆర్ తో ‘పాతాళభైరవి’ వంటి ఎవర్ గ్రీన్ ఫోక్లోర్ తెరకెక్కిస్తే, ఆయన తనయులు యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో ‘భైరవద్వీపం’ వంటి మేటి జానపదాన్ని నిర్మించడం విశేషం! ఏది ఏమైనా దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితం ఆరంభమైన ‘విజయాసంస్థ’ ఈ నాటికీ జనం మదిలో నిలచి ఉండడం, ఆ నిర్మాతల పేర్లనూ జనం గుర్తుంచుకోవడం మరపురాని అంశం!

Show comments