తన చిత్రాలలో ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని తపించేవారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. మహానటుడు యన్టీఆర్ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. యన్టీఆర్ తనయుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణకు, విశ్వేశ్వరరావు కూతురు శాంతి భార్య. మోహనకృష్ణ, శాంతి తనయుడే నవతరం నటుడు నందమూరి తారకరత్న.
యు. విశ్వేశ్వరరావు 1930 ఏప్రిల్ 30న కృష్ణాజిల్లాలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తండ్రి మరణించారు. సంపన్నుల కుటుంబంలోనే పుట్టడం వల్ల బంధువులు చేరదీశారు. ఎనిమిదో యేడు వచ్చే వరకు అల్లారు ముద్దుగా సాగారు. అప్పటి దాకా విశ్వేశ్వరరావుకు అక్షరాభ్యాసం జరగక పోవడం విశేషం. ఆ తరువాత బావ దావులూరి రామచంద్రరావు ప్రోత్సాహంతో చదువు సాగించారు. బి.ఎస్సీ., చదివాక గుడివాడ హైస్కూల్ లో టీచర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఈయన వద్ద ప్రముఖ నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, పి.రాఘవరావు విద్యార్థులుగా చదివారు. ఆయనకు తొలి నుంచీ విదేశీ చిత్రాలను అధ్యయనం చేయడం ఎంతో ఇష్టం! దాంతో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నారు. బావ రామచంద్రరావు ప్రోత్సాహంతో మదరాసు వెళ్ళి అక్కడ పి.పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ‘కన్యాశుల్కం’కు అసిస్టెంట్ గా పనిచేసే రోజుల్లోనే నటరత్న యన్టీఆర్ తో పరిచయం పెరిగింది. ఆ తరువాత యన్టీఆర్ నటించిన ‘బాలనాగమ్మ’ చిత్రాన్ని తమిళంలో అనువాదం చేసి నిర్మాతగా విజయం సాధించారు. ఆ పై అనేక తెలుగు చిత్రాలను తమిళంలో డబ్ చేసి నిలదొక్కుకున్నారు.
యన్టీఆర్ నటించిన పలు చిత్రాల నిర్మాతలకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక యన్టీఆర్ సొంత చిత్రాలను ఆయన తమ్ముడు యన్.త్రివిక్రమరావు నిర్మించే సమయంలో అతనికీ సహాయకునిగా మసలేవారు. యన్టీఆర్ కాల్ షీట్స్ ఇవ్వడంతో విశ్వేశ్వరరావు నిర్మాతగా మారారు. 1967లో తెరకెక్కిన మహత్తర జానపద చిత్రం ‘కంచుకోట’ను తమ విశ్వశాంతి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఆ సమయంలో వస్తోన్న జానపద చిత్రాలకు విభిన్నంగా జానపద గాథల్లోని రాజకీయ కోణాలను ఇందులో ఆవిష్కరించారు విశ్వేశ్వరరావు. ఈ చిత్రానికి సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. ‘కంచుకోట’ చిత్రం ఘనవిజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనూ శతదినోత్సవం చూసిన జానపద చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఆ తరువాత ‘మంజులా సినీ సిండికేట్’ పతాకంపై యన్టీఆర్ తో ‘నిలువుదోపిడి’ చిత్రం నిర్మించారు విశ్వేశ్వరరావు. ఈ చిత్రానికీ సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. ఇది ఫక్తు ఫార్ములా మూవీ. ఇందులో యన్టీఆర్ తమ్మునిగా కృష్ణ నటించారు. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని మూటకట్టుకుంది. విశ్వేశ్వరరావు ‘జ్యోతి సినీసిండికేట్’ పతాకంపై యన్టీఆర్ హీరోగా ‘పెత్తందార్లు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకుంది. ఇదయ్యాక ‘దీప్తి ఇంటర్నేషనల్స్’ పతాకంపై యన్టీఆర్ తో ‘దేశోద్ధారకులు’ చిత్రాన్ని నిర్మించారు. యన్టీఆర్ నటించిన తొలి సాంఘిక రంగుల చిత్రం ‘దేశోద్ధారకులు’ కావడం విశేషం. ఈ చిత్రాలన్నిటికీ సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. 1973లో విడుదలైన ‘దేశోద్ధారకులు’ ఘనవిజయం సాధించడమే కాదు, వసూళ్ళవర్షం కురిపించింది. ఆ రోజుల్లో కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టించింది.
‘దేశోద్ధారకులు’ దాకా సి.ఎస్.రావు దర్శకత్వంలో చిత్రాలు నిర్మించిన యు.విశ్వేశ్వరరావు, తరువాత తానే మెగా ఫోన్ పట్టారు. ఆయనకు వరల్డ్ సినిమాపై మంచి పట్టు ఉండేది. పలు చలనచిత్రోత్సవాలకు వెళ్ళి అంతర్జాతీయ చిత్రాలను చూసి ఆనందించేవారు. ఆ అభిరుచితోనే తాను దర్శకత్వం వహించే చిత్రాలు రెగ్యులర్ మూవీస్ కు భిన్నంగా ఉండాలని భావించారు. దర్శకునిగా మారిన తరువాత కూడా యన్టీఆర్ తోనే ‘తీర్పు’ అనే వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని ‘ద జడ్జ్ మెంట్’ పేరుతో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో రష్యా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ వైవిధ్యమైన చిత్రానికి ప్రభుత్వ అవార్డులతో పాటు, ప్రేక్షకుల రివార్డులూ లభించాయి. ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ‘పన్ను మినహాయింపు’ను ఇచ్చింది. తెలుగునాట తొలి పన్నుమినహాయింపు చిత్రంగా ‘తీర్పు’ నిలచింది. ప్రేక్షకుడు కొనే టిక్కెట్ పై పన్నుమినహాయింపు ఇవ్వడంతో తక్కువ రేటుకే యన్టీఆర్ సినిమా చూడవచ్చు అంటూ జనం థియేటర్లకు పరుగులు తీశారు. నిజానికి యన్టీఆర్ వంటి మాస్ హీరోతో ఇలాంటి ప్రయోగం చేస్తే నిర్మాతలకు తలబొప్పి కట్టేదే. కానీ, ఈ చిత్రంలోని కథావస్తువును దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం పన్నుమినహాయింపును ఇచ్చింది. దాంతో ప్రేక్షకులు ఈ సినిమాను భలేగా ఆదరించారు. నిర్మాతకు లాభాలు కూడా వచ్చాయి. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. 1976 జనవరి 9న ‘తీర్పు’ వంద రోజుల వేడుక హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో జరిగింది.
‘తీర్పు’ సినిమాతోపేరు బాగా రావడంతో విశ్వేశ్వరరావు ఆ తరువాత కూడా ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగారు. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ‘నగ్నసత్యం’ (1979), ‘హరిశ్చంద్రుడు’ (1980) చిత్రాలు వరుసగా ఉత్తమ తెలుగు చిత్రాలుగా జాతీయ అవార్డులు సంపాదించాయి. ‘కీర్తి కాంత కనకం’తో ఉత్తమ దర్శకునిగా, ‘పెళ్ళిళ్ళ చదరంగం’తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డులు అందుకున్నారు విశ్వేశ్వరరావు. ఈ చిత్రాలలో కొన్ని ఆయనకు లాభాలు సంపాదించి పెట్టాయి. మరికొన్ని అవార్డులు అందించాయి. 1990ల నుంచీ చిత్రనిర్మాణానికి ఆయన దూరంగా ఉన్నారు. 2021 మే 20న కరోనాతో విశ్వేశ్వరరావు చెన్నైలో కన్నుమూశారు. ఈ నాటికీ విశ్వేశ్వరరావు చిత్రాల గురించి సినీజనం చర్చించుకుంటూనే ఉన్నారు.
