ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేస్తోంది. తెలుగులో మహేష్ బాబుతో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉండగానే, హాలీవుడ్ అగ్ర నటుడు ఓర్లాండో బ్లూమ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘రీసెట్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ఫేమ్ మాట్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కథాంశం ప్రకారం.. ఒక దట్టమైన అడవిలో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న మహిళను, ఒక అపరిచితుడు (ఓర్లాండో బ్లూమ్) ఎలా కాపాడాడు అనే పాయింట్‌తో ఉత్కంఠభరితంగా సాగుతుందని సమాచారం. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాకు ప్రియాంక చోప్రా కేవలం నటి మాత్రమే కాదు, నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. హీరో ఓర్లాండో బ్లూమ్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ‘ది బ్లఫ్’ సినిమాను నిర్మించి సక్సెస్ అయిన ప్రియాంక, ఇప్పుడు ఈ ‘రీసెట్’ తో హాలీవుడ్‌లో తన నిర్మాణ విలువలని మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇటీవలే ‘సిటాడెల్’ సీజన్-2 తో అలరించిన ఈ భామ, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టుతో మరిన్ని అంచనాలు పెంచేసింది.
