NTV Telugu Site icon

President Gaari Pellam: మూడు పదుల ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’

President Gari Pellam

President Gari Pellam

President Gaari Pellam: ఓ సినిమాతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోకు సదరు చిత్రం ప్రభావం కొంతకాలం పాటు సాగుతుంది. కొన్నిసార్లు అది ‘ప్లస్’ కావచ్చు, మరికొన్ని సమయాల్లో ‘మైనస్’గానూ మారవచ్చు. ‘దేవదాసు’ సినిమా తరువాత ఏయన్నార్ కు అలాంటి పరిస్థితే వచ్చింది. దాని నుండి బయట పడటానికి అన్నట్టు ఆయన ‘మిస్సమ్మ’లో కామెడీ రోల్ లో కనిపించారు. ‘అల్లూరి సీతారామరాజు’ ఘనవిజయం తరువాత కృష్ణ నటించిన దాదాపు డజన్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. మళ్ళీ ఆయన ‘పాడిపంటలు’ సక్సెస్ తో ట్రాక్ పైకి వచ్చారు. అలాంటి పరిస్థితి నాగార్జునకు కూడా ఎదురయింది. నాగ్ కు ఓ స్పెషల్ క్రేజ్ తీసుకు వచ్చిన చిత్రం ‘శివ’. ఆ సినిమా ఘనవిజయంతో నాగార్జున సినిమా అంటే ఆ తరహాలో ఉండాలని ప్రేక్షకులు ఆశించారు. అయితే ఆ తరువాత నాగ్ నటించిన దాదాపు తొమ్మిది సినిమాలు పరాజయం బాటలో పయనించాయి. ఆ సమయంలో నాగ్ ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ పై నిలిపి చిత్రంగా ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ నిలచింది. నాగార్జున సరసన మీనా నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వి.దొరస్వామి రాజు నిర్మించారు. ఈ సినిమా 1992 అక్టోబర్ 30న విడుదల విజయకేతనం ఎగురవేసింది.

కథ విషయానికి వస్తే – 1972లో వచ్చిన ఏయన్నార్ ‘మంచిరోజులు వచ్చాయి’ కథలాగే ఈ ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ చిత్రం కూడా ఉంటుంది. వరాహపురం అనే ఊరిలో రాజా, అతని అన్నచంద్రయ్య, వదిన లక్ష్మి, చెల్లెలు సీతతో కలసి ఉంటాడు. ఆ ఊరికి ప్రెసిడెంట్ దేవుడు. అతని వద్దే చంద్రయ్య నమ్మినబంటులా పనిచేస్తుంటాడు. కానీ, దేవుడు చేసే అన్యాయాలను రాజా మాత్రం ఎండగడుతూ ఉంటాడు. దాంతో రాజా దేవుడికి కొరకరాని కొయ్యగా మారతాడు. దేవుడికి కొడుకు నరేంద్ర, కూతురు స్వప్న ఉంటారు. వారు సైతం దేవుడిలాగే అహంకారం నిండినవారే. ఓ సారి రాజా, స్వప్న మధ్య మాటల యుద్ధం సాగుతుంది. దాంతో అతనంటే ఆమె పగ పెంచుకుంటుంది. ఓ పథకం ప్రకారం రాజాను ప్రేమిస్తూ నటించి, అందరి ముందు అవమానిస్తుంది స్వప్న. అదే ఊరిలో ఉండే నాదముని, దేవుడి మనిషి. కానీ, ప్రతి విషయంలో దేవుడిని ఎగదోస్తూ, తరువాత తుస్సుమంటూ ఉంటాడు. దేవుడు మరోమారు ప్రెసిడెంట్ గా నిల్చుంటాడు. అతనికి పోటీగా రాజా నించుంటానని వస్తాడు. ఓడిపోతే, ఊరు వదలి వెళ్ళాలని రాజాకు చెబుతాడు దేవుని తరపున నాదముని. దేవుడు ఓడిపోతే ఆయన వెళ్తాడా? అని రాజా అంటాడు. మాటా మాటా పెరుగుతుంది. ఎన్నికల్లో దేవుడు ఓడిపోతే, దేవుడు కూతురినిచ్చి పెళ్ళి చేయాలని కోరతాడు రాజా. నాదముని ప్రోద్సబలంతో దేవుడు సరే అంటాడు. ఇద్దరూ రాతపూర్వకంగా పందెం వేసుకుంటారు. అనూహ్యంగా దేవుడు ఓడిపోయి, రాజా గెలుస్తాడు. స్వప్నను పెళ్ళాడతానని గుడికి తీసుకు వెళతాడు రాజా. కానీ, ఇష్టం లేని పెళ్ళి చావుతో సమానం అని ఆమెను మళ్ళీ దేవుడి దగ్గరకు చేరుస్తాడు. రాజా మంచి మనసు తెలుసుకున్న స్వప్న, అతడు పారేసిన తాళిని తీసుకొని కట్టుకొని పెళ్ళయిందని చెబుతుంది. దాంతో తల్లి ఆమెను రాజా చెంతకు చేరుస్తుంది. కొంత తతంగం సాగిన తరువాత రాజా, స్వప్న కాపురం హాయిగా సాగుతుండగా, నాదముని హత్యకు గురవుతాడు. దానికి కారణం రాజా అని అతడిని అరెస్ట్ చేస్తారు. స్వప్న జిల్లా కలెక్టర్ ను కలుసుకొని, కొందరి పథకం ప్రకారం తన భర్త జైలు పాలయ్యాడని చెబుతుంది. దాంతో ఊరిలోనే పంచాయతీ చేసి తీర్పు చెప్పే వీలు కల్పిస్తారు కలెక్టర్. కానీ, దేవుడు తన రౌడీలతో జనాన్ని భయపెట్టడం, రాజా వారిని చిత్తు చేసి అసలు నిజాలేంటో బయట పెడతాడు. అసలు దోషులైన దేవుడు, అతని కొడుకును పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ భార్య ఓ పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. విడిపోయిన రాజా, అతని అన్న కుటుంబం కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో నాగార్జున, మీనా జంటగా కనిపించగా, మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ, శ్రీకాంత్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, రాజా, చిట్టిబాబు, గౌతమ్ రాజు, చిడతల అప్పారావు, నరసింగ్ యాదవ్, అన్నపూర్ణ, సుధ, హరిత, డిస్కో శాంతి, బేబీ సునయన నటించారు. ఈ సినిమాకు తోటపల్లి మధు మాటలు రాయగా, వేటూరి పాటలు పలికించారు. కీరవాణి స్వరకల్పన చేశారు. “ఆ ఒడ్డూ… ఈ ఒడ్డూ…”, “తస్సా చెక్కా తళాంగు చుక్క…”, “పరువాల కోడి…”, “ఉమ్మ కావాలి…”, “నువ్వు మల్లెతీగ… నేను తేనెటీగ…” అంటూ సాగే పాటలు భలేగా అలరించాయి. అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసిందీ సినిమా. నాగార్జున అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘తలైవర్ పొండాట్టి’ పేరుతో అనువదించారు.