Premalu Telugu version Trailer Released: 2024లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్భుతమని మెచ్చుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు సైతం ‘ప్రేమలు’ సినిమా చూసి చాలా బావుందని అభినందిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టడమే కాకుండా ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. మార్చి 8న ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో అభిమానులు ఎంతో ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌ను గమనిస్తే హైదరాబాద్ ట్రైన్‌లో ప్రయాణిస్తోన్న నస్లేన్ , మమిత పాత్రలను చూపించటంతో ప్రారంభమవుతుంది. అలాగే మమిత నిద్రపోతున్న సమయంలో నెల్సన్ ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.
ఇక అక్కడి నుంచి నస్లేన్, మమిత మనసుని ఎలా గెలుచుకున్నాడనే జర్నీ ప్రారంభం అవుతుంది. నస్లేన్ పడే పాట్లు నవ్వును తెప్పిస్తున్నాయి. వీరిద్దరితో పాటు ఇతర పాత్రలను కూడా ట్రైలర్ లో చూపించారు. కామెడీ, ప్రేమ వంటి అంశాల కలగలిసిన సన్నివేశాలతో సినిమా ఉంటుందని ట్రైలర్ తో తెలుస్తుంది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని స్పష్టమవుతుంది. ఆదిత్య హాసన్ రాసిన చక్కటి సంభాషణలు నెల్సన్, సంగీత్ ప్రతాప్ మధ్య కామెడీ ఉంటూ ఎంజాయ్ చేసేలా ఉంది. ఉదాహరణకు RRRలో చెప్పిన ‘తొక్కుకుంటూ పోవాలే’ డైలాగ్ తో పాటు ఈ మధ్య పాపులర్ అయిన కుమారి ఆంటీ ప్రస్తావన వినోదాత్మకంగా ఉంది. అయితే తెలుగులో వాయిస్ లు ఎందుకో సెట్ అయినట్టు అనిపించడం లేదు. ఇక భావన స్టూడియోస్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతతన్, శ్యామ్ పుష్కరణ్ వంటి వారు కూడా నిర్మాణంలో భాగమయ్యారు. అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్.ఎం., అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. గిరీష్ ఎ.డి, కిరణ్ జోసే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. విష్ణు విజయ్ సంగీతాన్ని సమకూర్చగా అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ, ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.ఇక తెలుగులో నైన్‌టీస్ (90’s) ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి సంబాషణలు రాశారు.