418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. రిలీజ్ ఎప్పుడంటే?

418 300kb

418 300kb

418 Movie: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న సరికొత్త ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ‘418’. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భయపెట్టే సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు (CBFC) మొదట సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించగా, ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్‌ను జారీ చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం, సెన్సార్ ఆలస్యం కారణంగా వాయిదా పడి ఇప్పుడు 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ సినిమా కథాంశం సాధారణంగా వచ్చే హారర్ కామెడీ సినిమాలకు భిన్నంగా, ఎలాంటి కామెడీ లేకుండా ప్రేక్షకులను కేవలం భయపెట్టడమే లక్ష్యంగా సాగుతుంది. ఒక పల్లెటూరిలోని మెడికల్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో, సైన్స్‌కు మూఢనమ్మకాలకు మధ్య ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఒక రహస్యమైన తలుపు తెరిచిన తర్వాత చోటుచేసుకునే వింత పరిణామాల చుట్టూ ఈ సస్పెన్స్ మిస్టరీని అల్లారు. ప్రశాంత్ నీల్ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కూడా మేకర్స్ సిద్ధమవుతున్నారు. దర్శకుడిగా కీర్తన్ నాడగౌడకు ఇది తొలి సినిమా కావడంతో ‘418’ ఆయనకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారింది. మరి ‘ఏ’ సర్టిఫికెట్‌తో సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతున్న ‘418’ ప్రేక్షకులను ఎంతవరకు భయపెడుతుంది, మిస్టరీ థ్రిల్లర్‌గా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.