418 Movie: హారర్ సినిమా అంటేనే చీకటి, భయం, ఉత్కంఠ, ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టే థ్రిల్. అయితే అదే అంశం ఇప్పుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ మూవీకి అడ్డంకిగా మారింది. రిలీజ్ కు సిద్ధమవుతున్న సమయంలో ఈ మూవీ సెన్సార్ సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని హారర్ కంటెంట్ తీవ్రతపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సర్టిఫికేషన్ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తికాలేదని సమాచారం. దీంతో ఇప్పటికే రిలీజ్ ప్లాన్‌లో ఉన్న ఈ సినిమాకు మరోసారి బ్రేక్ పడినట్లయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘418’కు ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేసిన కీర్తన్ నాడగౌడ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రీతి పగడాల, చరణ్ లక్కరాజు, సూర్య రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ విలేజ్ మెడికల్ కాలేజీ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎన్నో భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, సంస్థ నిర్మిస్తున్న తొలి పూర్తి స్థాయి హారర్ సినిమా ‘418’ కావడం విశేషం. అందుకే ఈ సినిమా అప్డేట్స్ పై మొదటి నుంచే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం సినిమా సెన్సార్ పరిశీలనకు వెళ్లిన సమయంలో కొన్ని భయానక సన్నివేశాల తీవ్రతపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. హారర్ మూవీ కావడంతో భయపెట్టే సన్నివేశాలు ఉండటం సహజమే. కానీ ‘418’లో హారర్ మరింత తీవ్రంగా ఉండటంతో వాటి ప్రదర్శన విషయంలో సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తికాలేదు. అయితే సెన్సార్ అభ్యంతరాలను అంగీకరించి వెంటనే మార్పులు చేయడం కంటే, తమ సినిమాను మరోసారి పరిశీలించాల్సిందిగా కోరుతూ మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ కమిటీ నిర్ణయం ‘418’ రిలీజ్ కు కీలకంగా మారింది.
రివైజింగ్ కమిటీ సినిమా కంటెంట్‌ను మరోసారి పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూలై 31న రిలీజ్ చేయాలని అనుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సర్టిఫికేషన్ లభిస్తే రిలీజ్ కు సంబంధించిన తదుపరి పనులను మేకర్స్ వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇక ‘418’ కథలోని నేపథ్యం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. గ్రామీణ వాతావరణంలో ఉన్న మెడికల్ కాలేజీ, అక్కడి మూఢనమ్మకాలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ప్రశ్నించే ప్రయత్నం, వాటిని హారర్‌తో ముడిపెట్టిన విధానం సినిమాకు భిన్నమైన ట్రీట్‌మెంట్‌ను తీసుకురావచ్చని భావిస్తున్నారు.

