చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏది మాట్లాడితే వివాదం అవుతుందో ఎవరం చెప్పలేం. కొన్నిసార్లు తమ అభిప్రాయాలను చెప్పినా వాటిని కొంతమంది నెగెటివ్ గానే చూస్తారు. ప్రస్తుతం అదే ట్రెండ్ గా నడుస్తోంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఏదైనా సినిమా రిలీజ్ అయినా, లేక ప్రమోషన్స్ లో ఎవరైనా ఒక పదం తప్పుగా మాట్లాడినా తమ మనోభావాలను దెబ్బతీసే మాటలు అన్నారని పలు సంఘాలు వారిపై దుమ్మెత్తిపోస్తాయి. వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తాయి. ప్రస్తుతం హీరోయిన్ సాయి పల్లవి పరిస్థితి కూడా అలాగే ఉంది. విరాట పర్వం ప్రమోషన్స్ లో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అన్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు భజరంగ్దళ్ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆమె నటించిన సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. అయితే సాయి పల్లవి ఈ విషయమై క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక దీనిపై నెటిజన్లు సాయి పల్లవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అభిమానులతో పాటు తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం మద్దతు పలికారు. ట్విట్టర్ వేదికగా సాయి పల్లవికి సపోర్ట్ ఇచ్చాడు. సాయి పల్లవి వేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ “మానవత్వమే అన్నింటికంటే ముందు. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3
— Prakash Raj (@prakashraaj) June 19, 2022
