Site icon NTV Telugu

Hollywood: హాలీవుడ్ నవ్వుల్లో రాజకీయాలు!

Hollywood

Hollywood

ఇప్పుడు ఎవరైనా తెలుగు ఇంగ్లిష్ మిళితం చేసి మాట్లాడితే ‘టింగ్లిష్’ అంటున్నారు. అలాంటి మాటలు అమెరికాలో ఏ నాటి నుంచో హల్ చల్ చేస్తున్నాయి. రెండు మూడు భాషలను మిళితం చేసి మాట్లాడితే నవ్వుల పువ్వులూ పూస్తూ ఉంటాయి. కొందరు భాషాపండితులు ‘శభాష్’ అనీ అనవచ్చు. 2004లో ‘స్పాంగ్లిష్’అనే రొమాంటిక్ కామెడీ వచ్చింది. స్పానిష్, ఇంగ్లిష్ కలిపి మాట్లాడుతూ కితకితలు పెట్టించిందీ సినిమా. ఇందులో కథానాయకునిగా నటించిన ఆడమ్ శాండ్లర్ ను చూడగానే ఇప్పటికీ గిలిగింతలు కలిగి నవ్వుకొనేవారెందరో ఉన్నారు. అంతలా నవ్వించిన ఆడమ్ శాండ్లర్ కు అమెరికాలో ప్రఖ్యాత అవార్డుగా భావించే ‘మార్క్ ట్వేన్ ప్రైజ్ ఫర్ అమెరికన్ హ్యూమర్’ అవార్డు లభించింది. ప్రఖ్యాత ఇంగ్లిష్ రచయిత, వ్యాసకర్త మార్క్ ట్వేన్ పేరు మీదుగా ఏర్పాటయిన ఈ అవార్డును అందుకున్న 24వ వ్యక్తిగా ఆడమ్ శాండ్లర్ నిలిచారు. ఈ బహుమతి ప్రదానోత్సవానికి ఆడమ్ కు మంచి స్నేహితులైన తారలు జెన్నీఫర్ ఆనిస్టన్, డ్య్రూ బ్యారీమోర్, మరో కమెడియన్ క్రిస్ రాక్ పాల్గొన్నారు. ఈ క్రిస్ రాక్ నే 2022 ఆస్కార్ వేడుకల్లో విల్ స్మిత్ చెంప చెళ్ళు మనిపించారు.

ఈ అవార్డును తాను ఎన్నడూ ఊహించలేదని, అనుకోకుండా వచ్చిందని అందుకు ఎంతో గర్విస్తున్నానని ఆడమ్ శాండ్లర్ చెప్పుకున్నారు. అయితే ఆడమ్ ఏది చేసినా నవ్వులు పూస్తాయి. అందువల్ల ఆడమ్ మాటలు వినగానే అక్కడ హాజరయిన జనం నవ్వుకున్నారు. తాను చెప్పేది నిజం అంటూ ఆడమ్ గట్టిగా చెప్పారు. అయినా వాళ్ళు అతని స్పీచ్ కు చప్పట్లు కొట్టడం మరిన్ని నవ్వులు పూయించింది. శాండ్లర్ మిత్రులు, సహనటీనటులు ఆయన మాటలకు ఆద్యంతం నవ్వుతూనే ఉన్నారు. ఆ వేడుకలో పాల్గొన్న శాండ్లర్ తల్లి జూడీ సైతం నవ్వును ఆపుకోలేక పోయారు. అయితే, శాండ్లర్ కు ఈ అవార్డు లభించడం తమకెంతో గర్వకారణమని జూడీ అన్నారు. ‘ఆడమ్ నీకు సాటి వచ్చేవారెవరూ లేరు’ అంటూ జెన్నీఫర్ ఆనిస్టన్ చెప్పారు. నీకు నీవే సాటి అంటూ బ్యారీ మోర్ అన్నారు. ఇలా అందరూ అభినందనలతో ముంచెత్తుతున్న సమయంలో క్రిస్ రాక్ మరిన్ని నవ్వులు పూయించారు. అమెరికన్ ప్రెసిడెంట్ నివసించే వైట్ హౌస్ కు అతి సమీపంలో ఈ మార్క్ ట్వేన్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. దాంతో క్రిస్ రాక్ తన సంభాషణలో రాజకీయాలు చొప్పించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ అనుకరిస్తూ నవ్వులు పూయించారు. ఇంతకూ ట్రంప్ ను అరెస్ట్ చేస్తారా? చేయరా? అంటూ అందరినీ ప్రశ్నించారు క్రిస్ రాక్. ఈ నవ్వుల నావను చూడాలంటే మార్చి 26న ‘సీయన్.యన్.’లో వీక్షించాల్సిందేనట!

Exit mobile version