సినీ సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ సంగీత సజిత్ (46) కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆదివారం తిరువనంతపురంలోని తన సోదరి నివాసంలో కన్నుమూశారు. సంగీత కొద్దిరోజులుగా తన సోదరి వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన 46 ఏళ్ల సంగీత సజిత్ తమిళ్, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో సుమారు 200 పాటలు పాడారు.
ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘మిస్టర్ రోమియో’లోని తమిళ సాంగ్ ‘తన్నీరై కథలిక్కుమ్’తో సంగీత సజిత్ మంచి గుర్తింపు పొందారు. ఇటీవల మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’లోని ‘తాళం పోయి తప్పూమ్ పోయి’ సాంగ్ ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ నటించిన ‘కురుతి’ సినిమాలో థీమ్ సాంగ్ సంగీత సజిత్ పాడిన చివరి పాట.
గతంలో తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డుల వేడుకలో అప్పటి సీఎం జయలలిత ఎదుట ‘జ్ఞానపజాతే పిజింత్’ పాటను సంగీత ఆలపించారు. ఈ పాట ఎంతగానో ఆకట్టుకున్నందుకు సంగీతకు జయలలిత 10 గ్రాముల బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చారని వార్తలు కూడా వచ్చాయి.
