PB SRINIVAS Jayanthi : ఓహో పి.బి. శ్రీనివాసా… మధుర గాన నివాసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రచ్చ గెలిచి ఇంటికి వచ్చిన ఘనులు తెలుగు చిత్రసీమలో ఎందరో ఉన్నారు. మధురగాయకుడు పి.బి.శ్రీనివాస్ సైతం అలా ముందు పరభాషలో పాడాకే, మాతృభాష తెలుగులో గళం విప్పారు. తెలుగులో కన్నా కన్నడలోనే పి.బి. శ్రీనివాస్ మధురామృతం ఒలికించారు. పరభాషల్లో పంచామృత సమానమైన పాటలు పాడినా, మాతృభాషను ఏ నాడూ అశ్రద్ధ చేయలేదు పి.బి.
పి.బి.శ్రీనివాస్ 1930 సెప్టెంబర్ 22న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి ఫణీంద్రస్వామి ప్రభుత్వోద్యోగి. తల్లి శేషగిరమ్మ సంగీతంలో ప్రవీణురాలు. దాంతో పి.బి.కి చిన్నతనంలోనే పాటలు పాడటం అబ్బింది. వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ ను ప్రభుత్వ అధికారిగా చూడాలనుకున్నారు. అయితే తల్లి ప్రభావంతో పి.బి.శ్రీనివాస్ గానంతోనే సాగారు. బి.కామ్., పూర్తయిన తరువాత నుంచీ పాటగాడిగా మారాలనే ప్రయత్నాలు మొదలెట్టారు శ్రీనివాస్. తెలుగులో అప్పటికే ఘంటసాల మాస్టారు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలుతున్నారు. దాంతో పి.బి.శ్రీనివాస్ కు ఆట్టే అవకాశాలు లభించలేదు. ఉత్తరాది బాట పట్టి అక్కడ కొన్ని చిత్రాలలో కోరస్ పాడారు. తరువాత 1952లో రూపొందిన ‘మిస్టర్ సంపత్’ చిత్రంలో “అజి హమ్ భారత్ కీ నారీ…” సాంగ్ లో గీతా దత్ తో కలసి గానం చేశారు. అదే పి.బి. స్వరంలో జాలువారిన తొలి గీతం. తరువాత తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనూ పి.బి.శ్రీనివాస్ పాటలు పాడారు. ఇక తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్ కు నేపథ్యగానం చేసినా, ఎక్కువగా జగ్గయ్య, కాంతారావుకు పి.బి.శ్రీనివాస్ పాటలు పాడి అలరించారు. యన్టీఆర్ కు పి.బి. శ్రీనివాస్ నేపథ్యగానం చేసిన “ఆడబ్రతుకు, ఇంటికిదీపం ఇల్లాలే” వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. యన్టీఆర్ ‘మంచిమనిషి’లో జగ్గయ్యకు పి.బి.పాడిన “ఓహో గులాబి బాలా…” పాట తెలుగునాటనే కాదు, అంతటా ఉన్న పి.బి.శ్రీనివాస్ అభిమానులందరినీ అలరించింది. తరువాతి రోజుల్లో హరనాథ్, చలం వంటి నటులు కూడా పి.బి.శ్రీనివాస్ పాటలతోనే సాగారు. తమిళనాట జెమినీగణేశన్, శివాజీగణేశన్, ఎమ్.జి.రామచంద్రన్ కు కూడా పి.బి.శ్రీనివాస్ పాటలు పాడారు. జెమినీ గణేశన్ కు పి.బి. పాడిన పలు పాటలు ఈ నాటికీ పరవశింప చేస్తూనే ఉన్నాయి.
Also Read
- Irumudi : 'ఇరుముడి' అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
పి.బి.శ్రీనివాస్ దక్షిణాది అన్ని భాషల్లోనూ పాటలు పాడినా, కన్నడనాట రాజ్ కుమార్ కు పాడిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. రాజ్ కుమార్ స్వతహాగా గాయకుడైనా, పి.బి.శ్రీనివాస్ గానంతోనే ఆయన స్టార్ హీరోగా నిలిచారు. దాంతో పలు సంవత్సరాలు రాజ్ కుమార్ అభినయానికి, పి.బి.శ్రీనివాస్ గానానికి జోడీ కుదిరి అనేక మ్యూజికల్ హిట్స్ కన్నడ చిత్రసీమలో నిలిచాయి. రాజ్ కుమార్ ‘సంపత్తిగే సవాల్’ తరువాత నుంచీ సొంతగా పాటలు పాడుకోవడంతో, విష్ణువర్ణన్, శ్రీనాథ్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్ వంటివారికి పి.బి. పాటలు పాడారు. ఆ పాటలు సైతం మధురామృతం పంచాయి. ఇలా అన్ని భాషల్లోనూ అలరించిన పి.బి.శ్రీనివాస్ గానం, మాతృభాష తెలుగులోనూ కొన్నిసార్లు అమృతం కురిపించింది.
పి.బి.శ్రీనివాస్ కొన్ని చిత్రాలకు పాటలు కూడా రాశారు. కె.బాలచందర్ ‘ఆకలిరాజ్యం’లోని “తుహై రాజా మై హూ రాణీ…” హిందీ పాటను పి.బి.శ్రీనివాస్ రాయడం విశేషం. తరువాతి రోజుల్లో ఆయన సొంతగా ఓ ఛందస్సును రూపొందించి, అందులో పద్యాలు రాశారు. ఆయన మనవడు పి.బి. ఆనందవర్ధన్ అప్పట్లో బాలనటునిగా పలు చిత్రాలలో అలరించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన తరువాత భారీగా సన్మానం జరిగింది. అందులో తాను ఈ స్థాయికి రావడానికి పి.బి.శ్రీనివాస్ గానమే ప్రధాన కారణమనీ ఆ మహానటుడు వినమ్రంగా చెప్పారు. అంతేకాదు, పి.బి.శ్రీనివాస్ కన్నడ పాటకు ఆత్మ అనీ ఆయన శ్లాఘించారు. పి.బి.శ్రీనివాస్ మరణానంతరం బెంగళూరులోని ఓ పార్కుకు ఆయన పేరే పెట్టారు. ఇలా కన్నడిగుల గుండెల్లో గుడికట్టుకున్నారు మన పి.బి.శ్రీనివాస్. అందుకే పి.బి.శ్రీనివాస్ పాట మరపురానిది, మరువలేనిది అని అందరూ అంటారు. 2013 ఏప్రిల్ 14న పి.బి.శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన లేకున్నా, పి.బి. పంచిన మధురామృతం ఈ నాటికీ మనలను ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!