Site icon NTV Telugu

Pawan Kalyan: నేను ఓడిపోతాను అని నాకు తెలుసు.. నా కోసం ఆలోచించేది ఆ ఒక్కడే

Trivikram

Trivikram

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎలాంటి స్నేహ బంధం ఉందో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా కూడా వీరి స్నేహానికి ఉండే ఫ్యాన్ బేస్ వేరు అని చెప్పాలి. ఇక మాటల మాంత్రికుడు.. పవన్ కు రాజకీయంగా కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో త్రివిక్రమ్ ను గుర్తుచేసుకున్నాడు. సమాజం గురించి తాను ఆలోచిస్తే.. తన గురించి ఆలోచించే ఒకే ఒక్కడు త్రివిక్రమ్ అని చెప్పుకొచ్చాడు. అసలు త్రివిక్రమ్ కు తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, తన పోరు వలనే ఏం చేయలేక తన వెంట ఉంటున్నట్లు తెలిపాడు.

” 2014 నుంచి 2019 వరకు అంచలంచలుగా పెంచుదామనుకున్న పార్టీ.. ఈపాటికీ రికగ్నైజేడ్ పార్టీ అయిపోయేది. 18 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అదే కనుక 10 నియోజక వర్గాలు ఉండి ఉంటె దాదాపు 2 ఎంపీలు, 10, 12 ఎమ్మెల్యే సీట్లు వచ్చేవి. ఆరోజున నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే జనాలు వచ్చేస్తారు. నాకు చాలా స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అవగాహన ఉంది.. అతను పొలిటికల్ లీడర్ గా కూడా నాకు అవగాహన ఉంది. అందుకే నాకు వ్యూహం నాకు వదిలేయండి అని చెప్తాను.. నా దగ్గర అరమరికలు ఉండవు.. పవన్ కళ్యాణ్ ను బ్లాక్ అండ్ వైట్ లో చూస్తాను నేను.. కానీ, మీకు పవన్ కళ్యాణ్ తగ్గకుండా ఉండాలి. అయితే తగ్గడం అనేది చాలా అవసరం. తనను తానూ తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది. పరిస్థితిలు ముందుకు తీసుకెళ్లనప్పుడు మీకు మీరే తగ్గించుకోవాలి. అప్పట్లో ఒక 30 స్థానాల్లో పోటీ చేద్దామనుకున్నాను. కానీ అందరూ నన్ను కూర్చోపెట్టి ఒత్తిడి పెడితే నిస్సహాయంగా వదిలేశాను. దారుణం ఏంటంటే.. నేను ఓడిపోతాను అని కూడా నాకు తెలుసు. కానీ, యుద్ధం చేసేటప్పుడు జయాపజయాలను చూడకూడదు. యుద్ధమే చేయాలి. భీమవరంలో కూడా నేను ఓడిపోతాను అని తెలుసు.. ప్రచారంలోనే అర్ధమయ్యింది. గాజువాకలో ఆల్రెడీ ఓడిపోయాను. సినిమాలు అన్ని ఆపేసుకొని, డబ్బులు లేక, నేషనల్ వైడ్ సినిమాలు తీసే క్యాపబిలిటీ ఉండి, ఇంతమంది అభిమాన బలం ఉండి.. నేను ఒకటే అనుకున్నాను ఓడిపోయాకా.. సమాజం మీద, దేశం మీద ఒకడికి ఇంత పిచ్చి మంచిదా.. ? అని అనుకున్నాను.కానీ, దేవుడు నాకు ఒకటే చెప్పాడు.. అది నీ బాధ్యత.. నువ్వు నిర్వర్తించు.. కర్మయోగివి నువ్వు. ఫలితం నీకు అనవసరం.

పార్టీని ఎలా నడపాలో నాకు తెలియలేదు.. అలాంటి సమయంలో నాకు తోడుగా ఉన్న నా సన్నిహితుడు, స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే సమాజం కోసం నేను ఆలోచిస్తే నా కోసం ఆలోచించడానికి ఒకడు ఉండాలిగా. అలా వచ్చి నాకోసం వకీల్ సాబ్ అనే సినిమా చూపించి.. నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి నాలుగు సినిమాలు చేశాడు. అసలు నేను రాజకీయాల్లోకి రావడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. కానీ, నా వ్యధ భరించాలకేనే ఆయన జల్సాలో ఇంటర్వెల్ సీన్ లో నా కోపాన్ని చూపించే సీన్ రాశారు. ఒక సగటు మనిషి కోపం అది. నా టీనేజ్ లో నేను ఉద్యమాల వైపు వెళ్లిపోదామనుకున్నాను. ఆ కోపం అట్లా ఉండిపోయి.. ఉండిపోయి.. నా వ్యధ చూసి.. జల్సాలో డైలాగులు రాసాడు. కనీసం ఇతను సినిమాలో డైలాగులు చూసి పాలిటిక్స్ లోకి వెళ్ళడు అని అనుకోని రాశాడు. కానీ, నేను ఇంకా పెట్రేగిపోయాను. ఇంకా సినిమాలు ఆగట్లేదు.. ఇక చేసేదేమి లేక చేతులెత్తి.. ఇక మీ ఇష్టంమీరు ఏదైనా చేసుకోండి అని వదిలేశాడు. అది ఆయనకు తప్పదు కాబట్టి నన్ను భరిస్తాడు. అలాగే నా కుటుంబం నన్ను ఎంత అర్ధం చేసుకున్నారో నాకు తెలియదు.. నా రక్తం నన్ను ఎంత అర్ధం చేసుకున్నారో తెలియదు.. కానీ, నన్ను అభిమానించేవారికి నేను వెంటనే అర్దమైపోతాను.. కానీ, కొన్నిసార్లు ఆ కుటుంబానికే నేనేంటో చెప్పుకోవాల్సి వస్తుంది. బంధం దగ్గరయ్యే కొద్దీ చూడడం కష్టంగా ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version