NTV Telugu Site icon

Pawan Kalyan: కోలుకొంటారని భావించా.. ఇక లేరనే తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా!

Ramoji Rao Pawan Kalyan

Ramoji Rao Pawan Kalyan

Pawan Kalyan Emotional Note on Ramoji Rao Death: రామోజీ రావు కన్నుమూతతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ రామోజీరావు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర యోధుడు రామోజీ రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలపై, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు… ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం రామోజీరావు గారి దక్షతను తెలియచేసింది.

Ramoji Rao: రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?

ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను వేదికగా చేశారు. మీడియా మొఘల్ గా రామోజీరావు గారు అలుపెరుగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు రామోజీ రావు గారు అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలచి వేస్తోంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి. రామోజీరావు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ ఒక లెటర్ రిలీజ్ చేశారు.