భీమ్లానాయక్ సినిమా తర్వాత రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉగాది పండగ తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని రంగంలోకి దిగనున్నారు. వరుస సినిమాలతో ఆయన బిజీగా గడపనున్నారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు పలు కొత్త సినిమాల షూటింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్‌లో పవన్ పాల్గొననున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి పలు సెట్లను రూపొందించారు. ఏప్రిల్ 6 నుంచి హైదరాబాద్ శివారులో వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమా పూర్తయ్యేలోగా పవన్ మరో సినిమాను ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు వేణు ఊడుగుల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తారని తెలుస్తోంది. పవన్-వేణు ఊడుగుల ప్రాజెక్టుపై త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇటీవల విడుదలైన భీమ్లానాయక్ మూవీని కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరే నిర్మించింది. ప్రస్తుతం దర్శకుడు వేణు ఊడుగుల హీరో రానాతో విరాటపర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి, నివేదా పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
