NTV Telugu Site icon

Papam Pasivadu: యాభై ఏళ్ళ ‘పాపం పసివాడు’

Papam Pasivadu

Papam Pasivadu

Papam Pasivadu Movie Completes 50 Years: తెలుగు సినిమారంగంలో ‘చైల్డ్ సెంటిమెంట్’తో అనేక సూపర్ హిట్స్ నమోదయ్యాయి. స్టార్ హీరోస్ సైతం ఆ తరహా సక్సెస్ చూశారు. అప్పట్లో కేరెక్టర్ యాక్టర్ గా తనదైన బాణీ పలికించిన యస్వీ రంగారావు కూడా ‘చైల్డ్ సెంటిమెంట్’తో ఓ బంపర్ హిట్ ను పట్టేశారు. అదే ‘పాపం పసివాడు’. యస్వీఆర్ తన కెరీర్ ఆరంభంలో బి.యన్.రెడ్డి ‘బంగారు పాప’లోనూ చైల్డ్ సెంటిమెంట్ కాసేపు కనిపిస్తుంది. ఆ తరువాత యస్వీఆర్ ప్రధాన పాత్రలో విజయం చూసిన సినిమా ‘పాపం పసివాడు’. ఈ సినిమా 1972 సెప్టెంబర్ 29న విడుదలై విశేషాదరణ చూరగొంది.

ఇంతకూ ‘పాపం పసివాడు’ కథ ఏమిటంటే – వేణుగోపాలరావు, జానకి దంపతులకు లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు ఉంటాయి. అయితే పిల్లలు ఉండరు. దాంతో దూరపు చుట్టాలు సైతం వారి పంచన చేరి వారి మంచితనంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు. లేక లేక వారికి ఓ మగపిల్లాడు పుడతాడు. వాడిని ఎలాగైనా మట్టుపెట్టాలని ఆ ఇంటిలో రాబంధుల్లా ఉన్న బంధువులు ప్రయత్నిస్తారు. ఆ బాబు పేరు గోపి. అతనికి క్షయ ఉందని తెలుస్తుంది. గోపిని సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తారు కన్నవారు. జానకి తమ్ముడు పతి పైలట్ కావడంతో గోపిని తీసుకుని ఓ జెట్ ప్లెయిన్ లో వెళతాడు. పైనుండి కింద ఉన్న ఊరిని చూస్తూ గోపి ఎంతో సంతోషిస్తాడు. బాబును ఢిల్లీ చూపించాలని భావిస్తాడు పతి. ఇక వేణుగోపాల్ కు తమ్ముని వరసయ్యే నరసింహం, తన అన్నావదినలను యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంటాడు. వారు ప్రమాదానికి గురవుతారు కానీ, ప్రాణాలతో బయట పడతారు. గోపితో పయనిస్తున్న పైలట్ పతికి గుండె నొప్పి రావడంతో అతను ఫ్లైట్ నుండి పడిపోతాడు. ఆ జెట్ ఎడారిలో ల్యాండ్ అవుతుంది. తనతో పాటు ఉన్న కుక్కపిల్లతో కలసి గోపి, ఎడారిలో దిగుతాడు. తన మావయ్య పతి ఏమయ్యాడో తెలియక తికమక పడతాడు. అక్కడ ఎడారిలో గోపి పడరాని పాట్లు పడతాడు. ఊరిలో అతని కన్నవారు తీరని వేదన అనుభవిస్తారు. గోపి జాడను కనిపెట్టి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ వారు సాయం చేస్తారు. కానీ, అక్కడ గోపి కనిపించడు. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వారితో పాటే వెళ్ళిన నరసింహం వేరే దిశగా వెళ్ళి వెతుకులాట ఆరంభిస్తాడు. గోపిని ఎడారిలో ఉండే కోయరాజులు ఎత్తుకు పోయి, అపార్థం చేసుకొని గోపిని దేవతకు బలి ఇవ్వాలనుకుంటారు. అక్కడ ఓ పసివాడు, గోపిని తప్పిస్తాడు. తన కుక్కను తీసుకొని గోపి పరుగు తీస్తాడు. అతడిని కోయవాళ్ళు వెంటాడగా, నరసింహం కనిపిస్తాడు. వాడు గోపిని చంపాలని చూస్తాడు. అక్కడ రాజుకున్న మంటల్లో చిక్కి నరసింహం చస్తాడు. గోపి కన్నవారిని చూసి కేకేస్తాడు. వారు అతడిని రక్షిస్తారు. కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో యస్వీ రంగారావు, దేవిక, మాస్టర్ రాము, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, నగేశ్, నాగయ్య, త్యాగరాజు, రాజబాబు, సూర్యకాంతం, ఛాయాదేవి, నాగశ్రీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాతృక 1969లో జామీ ఉయిస్ రూపొందించిన ఆఫ్రికన్ మూవీ ‘లాస్ట్ ఇన్ ద డిజర్ట్’ ఆధారం. దానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి గొల్లపూడి మారుతీరావు కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. సత్యం సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు పలికించారు. అట్లూరి శేషగిరిరావు నిర్మించిన ఈ చిత్రానికి ఎ.పూర్ణచంద్రరావు నిర్వహణ బాధ్యతలు నెరిపారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో ‘పాపం పసివాడు’ తెరకెక్కింది. ఇందులోని “అమ్మా చూడాలి… “, “ఓ బాబూ మా బాబూ…”, “అయ్యో పసివాడా…”, “మంచి అన్నదే కానరాదురా…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఆరంభంలోనే లక్ష్మీస్తోత్రం కూడా ఆకట్టుకుంది.

శ్రీలక్ష్మిప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన ఎ. పూర్ణచంద్రరావు ఒకప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. తన పేరే ఉన్న అట్లూరి పూర్ణచంద్రరావు సావిత్రి దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా నిర్మించిన ‘మాతృదేవత’ చిత్రానికి కూడా ఈ పూర్ణచంద్రరావు పనిచేశారు. ఆ సినిమా సక్సెస్ లోనూ పాలు పంచుకున్నారు. మహానటుడు యన్టీఆర్ కు ఉన్న తిరుగులేని ఇమేజ్ తోనూ ఇతరులు లాభం పొందవచ్చునని ఆయన నమ్మకం. తాను నిర్మించిన ‘రౌడీ రాణి’ చిత్రాన్ని యన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’ విడుదలైన రెండు రోజులకు రిలీజ్ చేశారు. యన్టీఆర్ సినిమా ఓవర్ ఫ్లో తన చిత్రానికి వచ్చినా చాలనుకున్నారు. ఆయన ఊహ నిజమే అయి, ‘రౌడీరాణి’ కూడా మంచి విజయం సాధించింది. తరువాత ‘పాపం పసివాడు’ కరపత్రాలను హెలికాప్టర్స్ ద్వారా పై నుండి కిందకు వేస్తూ ప్రచారం చేశారు. తరువాత యన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’కి ఆ సినిమా నిర్మాత వై.వి.రావు జెట్ లో ఊరూరా పాంప్లెట్స్ విసిరారు. అలా ఎ.పూర్ణచంద్రరావు తన ఆలోచనలతో సక్సెస్ చూస్తూ, పబ్లిసిటీలో కొత్త పుంతలు తొక్కారు.

తరువాతి రోజుల్లో ఎ.పూర్ణచంద్రరావు , చిరంజీవితో ‘చట్టానికి కళ్ళు లేవు’ నిర్మించారు. ఈ సినిమాను హిందీలో ‘అంధా కానూన్’గా తెరకెక్కించి, రజనీకాంత్ ను హిందీ చిత్రసీమకు పరిచయం చేశారు. అనేక హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసిన పూర్ణచంద్రరావు, హిందీలోనూ పలు చిత్రాలు నిర్మించారు. ఈయనే రవితేజతో ‘వెంకీ’ సినిమా తెరకెక్కించారు.

Show comments