NTV Telugu Site icon

Palletoori Monagadu: నాలుగు పదుల ‘పల్లెటూరి మొనగాడు’

Palletoori Monagadu

Palletoori Monagadu

Palletoori Monagadu Completes 40 Years: మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగా జేజేలు అందుకోవడానికి కారణమైన చిత్రాలలో ‘పల్లెటూరి మొనగాడు’కూ స్థానం ఉంటుంది. తమిళ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రాజలక్ష్మీ ఆర్ట్ మూవీస్ పతాకంపై మిద్దే రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నాటి మేటి తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ రాసిన కథ ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. అంతకు ముందు చిరంజీవికి ఘన విజయాన్ని అందించిన ‘చట్టానికి కళ్ళులేవు’ చిత్రానికి కూడా శోభనే కథ సమకూర్చగా, చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ‘సట్టం ఒరు ఇరుట్టారై’ ఆధారం కాగా, ఈ ‘పల్లెటూరి మొనగాడు’కు ‘నెంజిలే తునివిరుందాల్’ మాతృక. ఆ రెండు తమిళ సినిమాలలోనూ విజయకాంత్ నాయకుడు, కాగా తెలుగులో రెండు చిత్రాల్లోనూ చిరంజీవి హీరో. రాధిక నాయికగా నటించిన ‘పల్లెటూరి మొనగాడు’ 1983 ఫిబ్రవరి 5న విడుదలయింది.

‘పల్లెటూరి మొనగాడు’ కథ ఏమిటంటే – పేదవాళ్ళకు వైద్యం అందించడమే ధ్యేయంగా డాక్టర్ శాంతి ప్రతినపూనుతుంది. అందుకు ఓ గ్రామాన్ని ఎంచుకుంటుంది. ఆ ఊరి జమీందార్ తనకు ఎవరు ఎదురొచ్చినా గుట్టు చప్పుడు కాకుండా తలతీసేస్తుంటాడు. అదే ఊరిలో రాజన్న అనే రౌడీ ఉంటాడు. జమీందార్ కూతురు ఓ పేదింటి అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ డాక్టర్ శాంతి ఆ ఊరినే ఎంచుకోవడానికి కారణం, ఆమె చిన్నప్పుడు అక్కడ పెరిగి ఉంటుంది. ఆమె తండ్రి కూడా డాక్టర్. ఆయనను జమీందార్ హతమార్చి ఉంటాడు. శాంతి చిన్నప్పటి ఫ్రెండ్ రాజన్న అనే తెలుస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. రాజన్న తీరు మారుతుంది. అది కూడా జమీందార్ కు నచ్చదు. జమీందార్ కూతురు, ఆమె ప్రేమించిన వాడికి రాజన్న అండగా నిలచి పెళ్ళి జరిపిస్తాడు. దాంతో జమీందార్ ఆగ్రహంతో ఊగిపోతాడు. అప్పటినుంచీ రాజన్నను, డాక్టర్ శాంతిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూంటాడు జమీందార్. ఆ ప్రయత్నాలను చిత్తు చేసి, జమీందార్ ను హతమారుస్తాడు రాజన్న. ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చిన రాజన్న, శాంతి కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో గొల్లపూడి మారుతీరావు, రాజేశ్, పూర్ణిమ, చలపతిరావు, వీరభద్రరావు, వేలు, కె.కె.శర్మ, అత్తిలి లక్ష్మి, ఆర్.నారాయణ మూర్తి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, సి.నారాయణ రెడ్డి, ఆత్రేయ, రోహీణీ చక్రవర్తి పాటలు పలికించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులోని “గుండె గది ఖాళీ…”, “పలుకే బంగారామా…”, “అక్కుమ్ బక్కుమ్ హో…”, “జడలోని బంతిపూవు…”, ‘ఎవరోయ్ పెద్దోళ్ళు…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘పల్లెటూరి మొనగాడు’ మాస్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత రాజలక్ష్మీ ఆర్ట్ మూవీస్ చిరంజీవితో ‘గూండా’ చిత్రాన్ని నిర్మించి మంచి విజయం సాధించింది.