Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!

Pallaburusu (1)

Pallaburusu (1)

Pallaburusu Teaser: గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిన్న సినిమాలు ఇటీవల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎపిక్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పళ్ళబురుసు’ కూడా అదే కోవలో వెళ్తున్నట్టే అనిపిస్తోంది.  నిన్న ఈ మూవీ టీజర్‌ను హీరో నాగ చైతన్య విడుదల చేయడంతో సినిమాపై మరింత చర్చ మొదలైంది. పల్లెటూరి జీవనశైలి, సహజమైన పాత్రలు, కామెడీ థీమ్స్ తో ఈ టీజర్ తొలి చూపుతోనే ఆకట్టుకుంటోంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నాగ చైతన్య ఈ టీజర్‌ను విడుదల చేయడం చిత్రానికి అదనపు ప్రచారాన్ని తీసుకొచ్చింది. టీజర్ ప్రారంభంలో కథానాయకుడు సంప్రదాయ వేపపుల్లతో పళ్లు తోముతుండగా గ్రామస్తులు ‘పల్లభూరుసు తేలుదా? అని అడిగే సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అక్కడి నుంచి సినిమా పూర్తిగా గ్రామీణ వాతావరణంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది.

ఈ మూవీకి ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించారు. అయితే ఆయన రూపొందించిన టీజర్‌లో కథలోని అసలు ట్విస్ట్‌ను బయటపెట్టకుండా, వినోదాన్ని మాత్రమే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే వీరిద్దరి మధ్య సాగే సరదా సంభాషణల నుంచి పుట్టే కామెడీ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. తండ్రి టూత్‌బ్రష్ కొనివ్వమని అడుగుతుంటే, కొడుకు తన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండే పరిస్థితిని హాస్యంగా చూపించారు. వారి మధ్య ఉండే అనుబంధం, చిన్న చిన్న గొడవలు ప్రేక్షకులను అలరించే అవకాశముంది.

ఇప్పటికే విడుదలైన ‘కొత్త సోకు’ జానపద గీతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఆ పాటతో సినిమాపై ఏర్పడిన ఆసక్తిని ఇప్పుడు టీజర్ మరింత పెంచింది. గ్రామీణ సంస్కృతితో రూపొందిన ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఇందులో ప్రజ్జ్వల్ యాద్మా, గోమతి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఎపిక్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు.  గ్రామీణ కథలు, సహజమైన పాత్రలు, కుటుంబ హాస్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘పళ్ళబురుసు’ ఒక మంచి వినోదాత్మక చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.