Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్

Faizaali

Faizaali

Faiza Ali: పెళ్లి తర్వాత నటీనటులు తమ కెరీర్‌లో కొన్ని పరిమితులు పెట్టుకోవడం కొత్త విషయం కాదు. కొందరు రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటే, మరికొందరు పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెబుతారు. అయితే పెళ్లి తర్వాత హీరోతో సన్నిహిత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేనని పాకిస్తానీ నటి ఫైజా అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైజా అలీ 2026లో ఐజాజ్ ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆమె ఫవాద్ ఫరూఖ్‌ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంతో సంతోషంగా ఉన్న ఆమె, తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని పెళ్లి తర్వాత తన నటనా ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రొమాంటిక్ సన్నివేశాల గురించి ప్రశ్నించగా, ఒక దశ తర్వాత అలాంటి పాత్రలు చేయడం తనకు సరైనదిగా అనిపించదని ఫైజా తెలిపారు. తాను పెళ్లి చేసుకున్నానని చెబుతూ, మరో హీరో చేతుల్లో ఊగుతూ ప్రేమ పాటలు పాడటం తన భర్తకు అసౌకర్యంగా ఉంటుందని అన్నారు. అలాగే కెమెరా ముందు మరో నటుడి కళ్లలోకి ప్రేమగా చూస్తూ నటించడం కూడా ఇప్పుడు తనకు మంచిగా అనిపించదని వెల్లడించారు. తన జీవితంలో ఐజాజ్ ఖాన్ లేకపోయి ఉంటే, ఒకవేలా తాను ఇప్పటికీ అవివాహితగా ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమోనని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. కానీ వివాహం తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలని తాను నమ్ముతున్నానని చెప్పారు. ముఖ్యంగా పాకిస్తాన్ కట్టుబాట్లు, అక్కడి సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని నటీనటులు కొన్ని హద్దులు పాటించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువయ్యాయని, ప్రమోషన్లలో కూడా రొమాంటిక్ కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఫైజా అన్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల మధ్య బోల్డ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని వెల్లడించారు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఫైజా అలీ ప్రస్తుతం టెలివిజన్ హోస్ట్‌గా, గాయనిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అందంతో పాటు, మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందిన ఆమె, మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ‘మెహందీ’ సీరియల్‌తో నటిగా పరిచయం అయ్యారు. అనంతరం నటి, గాయని, సంగీతం వంటి పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు.

పెళ్లి తర్వాత నటనలో తనకు తానే కొన్ని పరిమితులు పెట్టుకున్నానని ఫైజా అలీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో తన అభిప్రాయాన్ని ఆమె నేరుగా చెప్పడంతో పలువురు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం నటనను పర్సనల్ లైఫ్ తో ముడిపెట్టకూడదని అభిప్రాయపడుతున్నారు.