NTV Telugu Site icon

Paidipalli Satyanand: భావిరచయితలకు మార్గదర్శి – సత్యానంద్ బాణీ!

Satyanand Birthday Special

Satyanand Birthday Special

Paidipalli Satyanand: ‘‘దేవుడు దేవుడిలా దిగిరాడని.. ఈ టెలిగ్రాములో దూరొచ్చాడు..’’ అంటాడు ఉరిశిక్ష నుండి బయటపడ్డ ‘మాయదారి మల్లిగాడు’. ‘‘జ్యోతీ.. దీపంలా నా గుండెలో వెలుగుతావనుకున్నాను.. కానీ, మంటవై అంటిస్తావని అనుకోలేదు..’’ అని ‘జ్యోతి’ ప్రియుడు బావురుమంటాడు. ‘‘ఈ కొండవీటి చుట్టు పక్కలా నేరాలు ఘోరాలు చేసే నీలాంటి నీచుల్ని కొట్టిన దెబ్బ కొట్టకుండా సమూలంగా సర్వనాశనం చేసే సింహాన్ని’’ అంటూ ‘కొండవీటి సింహం’ గర్జన సాగుతుంది. ఇలా సెంటిమెంట్, లవ్, ఎమోషన్‌ను తన కలం నుండి జాలువారేలా చేసిన ఘనుడు ప్రముఖ రచయిత పైడిపల్లి సత్యానంద్. ఆయనను చూడగానే, ఆ ముఖంలో సరస్వతీ కళ కనిపిస్తుంది. కథకు అనువైన మాటలు పలికించడంలో సత్యానంద్ నైపుణ్యం వినిపిస్తే, మది పులకిస్తుంది.

సత్యానంద్ పుస్తకాల పురుగు. ఇప్పటికీ ఏదో ఒక పుస్తకం పట్టుకొని కనిపిస్తారు. బాగా రాయాలంటే బాగా చదవాలి అనే మాటను తు.చ. తప్పక పాటిస్తారు. అందుకే కొందరు దర్శకులు సత్యానంద్ మాటల కోసం పరుగులు తీసేవారు. ఆయన కల్పించిన కథలకూ ప్రాధాన్యమిచ్చేవారు. ఆదుర్తి సుబ్బారావుకు కావలసిన వారు కావడంతో చిత్రసీమలో అడుగుపెట్టారు సత్యానంద్. ప్రతిభంటూ లేకపోతే, ఎవరూ ఇక్కడ రాణించలేరు. ఆదుర్తి ఓ చిన్న కథను సత్యానంద్‌కు ఇచ్చి, దానిని పెద్దగా మార్చమన్నారు. తక్కువ సమయంలోనే ఓ నవలగా ఆ కథను మలిచారు సత్యానంద్. అతనిపై గురి కుదరడంతో తాను తెరకెక్కించిన ‘మాయదారి మల్లిగాడు’ సినిమా ద్వారా రచయితగా సత్యానంద్‌ను పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘జ్యోతి’కి, ఎ.మోహన్ గాంధీ తొలి చిత్రం ‘అర్ధాంగి’కి, ఆ రోజుల్లో సంచలన చిత్రంగా నిలచిన ‘కలియుగ స్త్రీ’కి సత్యానంద్ రచన ఆకట్టుకుంది. యన్టీఆర్ నటించిన ‘ఎదురీత’ హిందీ చిత్రం ‘అమానుష్’ రీమేక్. దానికి సైతం సత్యానంద్ తెలుగుదనం అద్ది సంభాషణలు పలికించారు. సత్యానంద్ చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే జంధ్యాల కూడా కాలుమోపారు. జంధ్యాల- సత్యానంద్ మధ్య స్నేహబంధం కుదిరింది. ఇద్దరూ కలసి కొన్ని చిత్రాలకు కథలు సమకూర్చారు. ఓ సినిమాకు సత్యానంద్ మాటలు పలికిస్తే, మరో సినిమాకు జంధ్యాల సంభాషణలు రాసేవారు. జంధ్యాల దర్శకుడైన తరువాత స్టార్ డైరెక్టర్స్ అందరూ సత్యానంద్ సంభాషణలకే ప్రాధాన్యమిచ్చారు. యన్టీఆర్ సూపర్ హిట్ మూవీస్ ‘గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి’కి సత్యానంద్ రాసిన సంభాషణలు ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించాయి. దాంతో స్టార్ హీరోస్ అందరూ సత్యానంద్ రచనకే ఓటు వేశారు.

ప్రస్తుతం టాప్ స్టార్స్‌గా వెలుగొందుతున్న నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు హీరోలుగా నటించిన తొలి చిత్రాలకు సత్యానంద్ రచన చేయడం విశేషం. ఈ ముగ్గురు హీరోలు ఈ నాటికీ స్టార్‌డమ్ చూస్తూ సాగుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతుంటారు సత్యానంద్. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘మిస్టర్ వి’ నవల ఆధారంగా తెరకెక్కిన ‘ఝాన్సీ రాణి’ చిత్రానికి సత్యానంద్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా అంతగా అలరించలేదు. దాంతో రచనకే పరిమితం అయ్యారు సత్యానంద్. ఇప్పటికీ ఎంతోమంది పేరున్న దర్శకులు తమకు ఏదైనా సందేహం కలిగితే, ఈ సీనియర్ రైటర్ సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. తెలుగు చిత్రసీమలో సత్యానంద్ మార్క్ డైలాగులు, వాటిలోని పవర్ తెలియాలంటే ఆయన రచన చేసిన చిత్రాలు చూస్తే చాలు. తెలుగు చిత్రసీమలో రచయితలు కావాలని ఆశించేవారు సత్యానంద్ బాణీని పరిశీలిస్తే, పరమానందం చెందడమే కాదు, తమ ఉనికినీ చాటుకొనే మార్గం తెలుసుకోగలరు.