Site icon NTV Telugu

Laxman Bhatt Tailang: పద్మశ్రీ అందుకోకుండానే ప్రముఖ సింగర్ మృతి..

Lakshma

Lakshma

Laxman Bhatt Tailang: భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియా మరియు వయోవృద్దాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనను జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పండిట్ తైలాంగ్ కుమార్తె, స్వయంగా ప్రఖ్యాత ధృపద్ గాయని అయిన ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ తన తండ్రి మరణాన్ని ధృవీకరించింది. ” గత కొన్ని రోజులుగా నాన్నగారి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం దుర్లభ్‌జీ ఆసుపత్రిలో చేర్పించాం. చికిత్స సమయంలోనే ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు”అని తెలిపింది. ఇక ఈ వార్త తెలియడంతో సంగీత కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇక ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలకు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ ఎంపిక అయ్యారు. మరి కొద్దిరోజుల్లో అవార్డును అందుకోవాల్సి ఉండగా .. ఈలోపే ఆయన మరణించడం ఎంతో ఆవేదనకు గురిచేస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ తన జీవితం మొత్తాన్ని సంగీతానికే అర్పించారు. పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ బనస్థలి విద్యాపీఠ్, రాజస్థాన్ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా ఆయన పనిచేశారు. 1985లో జైపూర్‌లో రసమంజరి పేరుతో ఒక సంగీతోపాసన కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగానే విద్యను అందించారు. జైపూర్‌లో అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్ ని స్థాపించి పేదవారికి సహాయ సహకారాలు అందించారు. ఇక ఈ సేవలుకు గాను ఆయనకు పద్మశ్రీ ఇచ్చి కేంద్రం గౌరవించింది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version