Ooru Peru Bhairavakona: టాలీవుడ్ లో సినిమాలు ఎప్పుడు పోటీకి వస్తాయో.. ఎప్పుడు వెనక్కి తగ్గుతాయి చెప్పడం కష్టం. కొంతమంది స్టార్ హీరోలతో పోటీ ఎందుకు అని వెనక్కి తగ్గుతారు. ఇంకొంతమంది కథలో బలం ఉంది వెనక్కి తగ్గలేం లేని ఖరాకండీగా చెప్పేస్తారు. అయితే.. ఇంకొంతమంది ఫిల్మ్ ఛాంబర్ మీద ఉన్న గౌరవంతో వెనక్కి తగ్గుతారు. మన కుర్ర హీరో సందీప్ కిషన్.. ప్రస్తుతం అదే చేస్తున్నాడు. ఫిల్మ్ ఛాంబర్ మీద ఉన్న గౌరవంతో.. తన సినిమాను వెనక్కి నెట్టాడు. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. సంక్రాంతికి దాదాపు 5 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. కానీ, థియేటర్స్ సర్దుబాటు కాలేదు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ రవితేజ నటించిన ఈగల్ ను వెనక్కి తగ్గాలని, అలా తగ్గితే.. ఈసారి తమ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పారు.
సోలో రిలీజ్ అంటే.. ఆ డేట్ లో ఎలాంటి సినిమా పోటీకి రాకుండా చూడాలి. అందుకే ఈగల్ మేకర్స్.. ఫిల్మ్ ఛాంబర్ కు తలొగ్గి సంక్రాంతి నుంచి తప్పుకున్నారు. ఇలా ఈగల్ ఫిబ్రవరి 9 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అదే రోజు సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన రిలీజ్ డేట్ ను ప్రకటించింది. సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండోసారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ కావడం, ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజైన ట్రైలర్ ఆసక్తిగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 9 న ఈగల్ కు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని మాట ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్.. సందీప్ మరియు మేకర్స్ తో చర్చలు జరిపి వెనక్కి వెళ్లేలా చేశాయి. దీంతో సందీప్ తన సినిమాకు కొత్త డేట్ ను వెతుక్కున్నాడు. ఊరి పేరు భైరవకోన ఫిబ్రవరి 16 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈగల్ కు అడ్డులేకుండా వెనక్కి వెళ్లిన ఈ కుర్ర హీరో సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
