NTV Telugu Site icon

Ooru Peru Bhairavakona: సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఆపండి- నట్టి కుమార్

“humma Humma” From ‘ooru Peru Bhairavakona’ Is Out

“humma Humma” From ‘ooru Peru Bhairavakona’ Is Out

సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ… ఫిబ్రవరి 16కి వాయిదా పడింది. సందీప్ కిషన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఊరు పేరు భైరవకోన సినిమాపైనే సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ వెళ్ళింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరి నట్టి కుమార్… సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లెటర్ పెట్టాడు.

“ఊరు పేరు భైరవకోన” సినిమా టిక్కెట్లు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందే బుక్ మై షోలో తెరవబడ్డాయి. నిజానికి సెన్సార్ నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వకుండా సినిమా విడుదల తేదీని ప్రచారం చేయకూడదు. కానీ పైన పేర్కొన్న సినిమాను ఫిబ్రవరి 16న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు సెన్సార్ నిబంధనలకు విరుద్ధంగా బుక్ మై షోలో టిక్కెట్లు తెరిచారు. మా ఫిర్యాదులోని ఈ రెండు అంశాలపై చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అలాగే ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలు ఏ తేదీన సెన్సార్‌కి దరఖాస్తు చేసుకున్నారు, వారికి అప్లై చేసిన ఆర్డర్ లిస్ట్‌లో చాలా సినిమాలు సెన్సార్ స్క్రీనింగ్ కోసం పెండింగ్‌లో ఉండగా ఈ సినిమాని ముందుగా ఎందుకు సెన్సార్ చేయాల్సి వచ్చింది? హైదరాబాద్ రీజినల్ సెన్సార్ బోర్డ్ వారు దీనికి బాధ్యులని తేలితే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఏ రకమైన సర్టిఫికేట్ జారీ చేయబడుతుందో తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా బుక్ మై షో టిక్కెట్లను ఎలా తెరవవచ్చు? పిల్లలు చూడకూడదని సర్టిఫికేట్ జారీ చేస్తే, టిక్కెట్లు ముందుగానే జారీ చేయబడినందున దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. వెంటనే సెన్సార్ సర్టిఫికెట్, సినిమాను ఆపేయాలని కోరుతున్నాను.

సార్… రీసెంట్ గా “యాత్ర-2” సినిమా విషయంలో సెన్సార్ సర్టిఫికేట్ కూడా రాకముందే రిలీజ్ డేట్ గురించి విపరీతంగా ప్రచారం జరిగింది. అలాగే, సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు బుక్ మై షోలో టిక్కెట్లను తెరిచారు. ఇలా వరుస సమస్యలు వస్తున్నా సెన్సార్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అలాగే ఇటీవల విడుదలైన తెలుగు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి పెద్ద నిర్మాతలు సెన్సార్ కు అప్లై చేసిన వెంటనే సెన్సార్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాల సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి వేచి ఉండాల్సిందే. నిర్మాతగా ఎన్నో చిన్న, మధ్యతరహా బడ్జెట్ సినిమాలు చేశాను, ఈ పరిణామాలు చాలా బాధగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, ప్రాంతీయ సెన్సార్ బోర్డు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు విమర్శనాత్మకంగా మారాయి. గతంలో సెన్సార్ ఆఫీసర్లుగా పనిచేసిన కైలాష్ ప్రసాద్, రత్నమాల, శ్యాంప్రసాద్ తదితరులు స్ట్రిక్ట్ ఆఫీసర్లుగా, నిజాయితీపరులుగా సెన్సార్ బోర్డ్ హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు. కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ పెద్ద నిర్మాతలపై కూడా వారి హయాంలో కేసులు పెట్టిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న హైదరాబాద్ రీజనల్ సెన్సార్ బోర్డ్ విధానాలు, తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలో సినిమాలకు ఆర్డర్ లో అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా సెన్సార్ జరగకపోవడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
సెన్సార్ ఏజెంట్ సురేష్, సెన్సార్ బోర్డ్ ఉద్యోగి కరుణాకర్‌లను విచారించి వారి ఫోన్ నంబర్లు, గూగుల్ పే, బ్యాంకు అకౌంట్ నంబర్లను పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. నేను పైన పేర్కొన్న అన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ నట్టి కుమార్ CBFCకి లెటర్ పెట్టాడు. మరి ఈ విషయం ఎంతదూరం వెళ్తుంది? సెన్సార్ బోర్డ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఊరు పేరు భైరవకోన సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.