NTV Telugu Site icon

మరోసారి పవన్ కళ్యాణ్‌ చిత్రానికి ఆనంద సాయి!

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దగ్గర దగ్గరగా నూరు చిత్రాల వరకు తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా మారబోతున్నారు. కొంత కాలం విరామం తరువాత ఆయన ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా, భారీ స్థాయిలో, భారీ వ్యయంతో నిర్మించనున్న చిత్రానికి కళా దర్శకునిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన తొలి చిత్రం, సుదీర్ఘ విరామం తరువాత ఆయన కళా దర్శకునిగా బాధ్యతలు స్వీకరిస్తున్న చిత్రం పవన్ కళ్యాణ్ గారిదే కావటం విశేషం. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, దర్శకుడు హరీష్ శంకర్ కళా దర్శకుడు ‘ఆనంద్ సాయి’ గార్కి ఘన స్వాగతం పలుకుతూ, గౌరవ పూర్వకంగా తమ చిత్రానికి కళా దర్శకునిగా ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు.