ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. రెండు నెలల తరువాత ఈ సినిమా ఓటిటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన విషయం విదితమే. ఇప్పటివరకు ఏ సినిమా అందుకొని రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ సినిమా కైవసం చేసుకొంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు. భారీ ధరపెట్టి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ జీ 5 సొంతం చేసుకున్న విషయం విదితమే. మే 20 నుంచి ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కానుండగా.. హిందీ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. మరి థియేటర్ లోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓటిటీలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
