O Sukumari OTT Deal: ‘ఓ..! సుకుమారి’కి ఓటీటీలో క్రేజ్.. రిలీజ్‌కు ముందే రైట్స్ ఫిక్స్!

Osukumari

Osukumari

O Sukumari OTT Deal: థియేటర్లలోకి అడుగుపెట్టక ముందే ఓటీటీ మార్కెట్‌లో భారీ డీల్ దక్కించుకోవడం ఇప్పుడు సాధారణ విషయమే అయినా, కొత్త తరహా కథలతో వస్తున్న చిత్రాలకు ఇలాంటి ఆదరణ లభించడం విశేషంగా మారుతోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ముందుగానే హక్కులు సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరింది తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ..! సుకుమారి’. థియేటర్లలో విడుదల కాకముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఈ నెల 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతుండటమే కాకుండా, కథను కూడా ఆయనే అందించడం విశేషం. ఈ చిత్రం తిరువీర్ కెరీర్‌లో పూర్తిస్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. గతంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఇప్పుడు తొలిసారిగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఐశ్వర్య రాజేష్ కూడా విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కావడంతో, ఈ జంట తెరపై ఎలా కనిపించబోతుందనే ఆసక్తి అయితే అభిమానుల్లో ఉంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుండగా, స్ట్రీమింగ్ తేదీని మాత్రం విడుదల అనంతరం అనౌన్స్ చేయనున్నారు.

ఇక ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అమనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భరత్ మంచిరాజు సంగీతం అందిస్తుండగా, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఆకట్టుకునే అంశాలతో రూపొందినట్లు తెలుస్తోంది. ఇటీవల చిన్న, మధ్యస్థాయి సినిమాలకు కూడా ఓటీటీ మార్కెట్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ హక్కులు కూడా నిర్మాతలకు ఆర్థిక కష్టాలను గట్టెక్కించే వనరుగా మారుతోంది. ఇప్పుడు ‘ఓ..! సుకుమారి’ కూడా విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ హక్కులను సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకులతో పాటు, సినీ వర్గాల్లో కూడా మరింత పెరిగింది.