Nora Fatehi Defamation Case: బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఓ చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా కోర్టు కేసుకు దారితీశాయి. విమానాన్ని ‘టాయ్ ప్లేన్’, ‘లెగో ఎయిర్‌ప్లేన్’ అంటూ నోరా చేసిన వ్యాఖ్యల వల్ల తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆరోపిస్తూ డ్యూన్స్ ఏవియేషన్ గాంధీనగర్ కోర్టును ఆశ్రయించింది. సంస్థ నోరా నుంచి ఏకంగా రూ.3 కోట్ల నష్టపరిహారం కోరుతోంది.
ఈ వివాదం గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఓ విమాన ప్రయాణానికి సంబంధించినది. ముంబై నుంచి జైపూర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో నోరా ఫతేహి డ్యూన్స్ ఏవియేషన్‌కు చెందిన Cessna Citation CJ2 చార్టర్డ్ విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో విమానం లోపల కొన్ని వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఆ వీడియోల్లో విమానాన్ని చిన్నదిగా, బొమ్మ విమానంలా, లెగోతో చేసిన విమానంలా నోరా అభివర్ణించారని సంస్థ ఆరోపించింది.
నోరాకు సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉండటంతో ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా మందికి చేరాయని డ్యూన్స్ ఏవియేషన్ చెబుతోంది. ఈ కామెంట్ల కారణంగా తమ సంస్థపై నమ్మకం తగ్గిందని, బుకింగ్స్ కూడా ప్రభావితమయ్యాయని ఆరోపించింది. ముఖ్యంగా బుకింగ్స్ 15 నుంచి 20 శాతం వరకు తగ్గాయని, కొన్ని బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయని సంస్థ కోర్టుకు తెలిపింది. దీంతో తమకు ఆర్థిక నష్టంతో పాటు గుడ్‌విల్ కూడా దెబ్బతిందని పేర్కొంది.
అయితే విమానం విషయంలో తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని డ్యూన్స్ ఏవియేషన్ స్పష్టం చేసింది. సదరు విమానం DGCA గుర్తింపు పొందిందని, చెల్లుబాటు అయ్యే నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ కింద చట్టబద్ధంగా నడుస్తోందని తెలిపింది. నోరా చేసిన వ్యాఖ్యలు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా, వాస్తవాలను ధృవీకరించకుండా చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలని కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది.
రూ.3 కోట్ల నష్టపరిహారంతో పాటు సోషల్ మీడియాలో ఉన్న సంబంధిత వీడియోలు, పోస్టులను తొలగించాలని కూడా డ్యూన్స్ ఏవియేషన్ కోర్టును కోరింది. అంతేకాకుండా నోరా ఫతేహి బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో దాఖలు చేసినట్లు సమాచారం. గాంధీనగర్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అగర్వాల్ సెప్టెంబర్ 25న ఈ కేసును విచారించనున్నారు. కోర్టు కూడా ఆమెకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళూ ఈ విషయం గోప్యంగా ఉన్నా, ఎట్టకేలకు మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా నోరా ఫతేహి సుపరిచితమే. ‘బాహుబలి’లో ‘మనోహరి’, ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ వంటి పాటలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు విమానంపై చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యల కారణంగా నోరా ఎదుర్కొంటున్న ఈ రూ.3 కోట్ల పరువు నష్టం కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

