Site icon NTV Telugu

AP movie tickets: టిక్కెట్ రేట్ల పెంపులో కొత్త కోణం!

Ticket rates

Ticket rates

ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల కు సంబంధించి కొత్తగా రూపొందించిన జీవో మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను చూసిన వారు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సీఎంను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్న తర్వాత ఇటు సాధారణ ప్రజలకు, సినిమా వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన హామీలలో కొన్ని నిలబెట్టుకున్నా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో పెద్దంత పెద్దమనసు చూపించలేదని కొందరు పెదవి విరుస్తున్నారు.

ఈ కొత్త జీవో ప్రకారం గతంలో ఉన్న మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలను ఇప్పుడు మూడుగా మార్చేశారు. సినిమా వాళ్ళు కోరిన విధంగా నగర, గ్రామ పంచాయితీలను ఏకం చేశారు. అలానే గతంలో ఏసీ, ఎయిర్ కూల్డ్, నాన్ ఏసీ థియేటర్లు ఉండగా ఇప్పుడు వీటిని ఏసీ, నాన్ ఏసీ రెండు విభాగాలుగా మార్చారు. ఎయిర్ కూల్డ్ థియేటర్లను ఏసీ థియేటర్లలో కలిపేశారు. అలానే కొత్తగా స్పెషల్ కేటగిరి థియేటర్స్ అనే దానిని ఏర్పాటు చేశారు. మల్టీప్లెక్స్ తరహాలో వసతులు ఉన్న సింగిల్ థియేటర్లకు వేరే టిక్కెట్ రేట్లను ప్రకటించారు. ఇక మల్టీప్లెక్స్ లకూ సపరేట్ టిక్కెట్ రేట్లు ప్రకటించారు. మరో విశేషం ఏమంటే ఇంతవరకూ అత్యధిక సింగిల్ థియేటర్లలో మూడు క్లాసులు, కొన్ని చోట్ల నాలుగు క్లాసులు ఉన్నాయి. మల్టీ ప్లెక్స్ థియేటర్లలో కూడా అత్యధికమైన వాటిలో రెండు క్లాసులు, కొన్నింటిలో మూడు క్లాసులు ఉన్నాయి. కానీ స్టేట్ లోని ప్రతి థియేటర్ లోనూ రెండే క్లాసులు ఉండేలా ఈ జీవో ను రూపొందించారు. అంటే ప్రతి థియేటర్ లో ప్రీమియమ్, నాన్ ప్రీమియమ్ అనే రెండే సెక్షన్లు ఉంటాయి. అయితే ప్రతి థియేటర్ లోనూ దాని సిట్టింగ్ కెపాసిటీలో ఖచ్చితంగా 25 శాతం సీట్లు నాన్ ప్రీమియమ్ కేటగిరికి కేటాయించాల్సి ఉంటుంది. 7-3-2022 తేదీన విడుదల చేసిన జీవో నంబర్ 13 ప్రకారం రేట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

రేట్ల వివరాలు:

  1. మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియమ్ రూ.40, ప్రీమియమ్ రూ.60గా నిర్ణయించారు. ఇక ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియమ్ రూ.70, ప్రీమియమ్ రూ.100గా చేశారు. స్పెషల్ కేటగిరీ థియేటర్లలో నాన్ ప్రీమియమ్ రూ. 100గానూ, ప్రీమియమ్ ను రూ. 125గానూ నిర్ణయించారు. మల్టీప్లెక్స్ ల్లో రెగ్యులర్ సీట్లకు రూ. 150, రిక్లైనర్ సీట్లకు రూ.250 ఉండాలని సూచించారు.
  2. మునిసిపాలిటీ ప్రాంతంలోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియమ్ రూ.30, ప్రీమియమ్ రూ.50గా నిర్ణయించారు. ఇక ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియమ్ రూ.60, ప్రీమియమ్ రూ.80గా చేశారు. స్పెషల్ కేటగిరీ థియేటర్లలో నాన్ ప్రీమియమ్ రూ. 80గానూ, ప్రీమియమ్ ను రూ. 100గానూ నిర్ణయించారు. మల్టీప్లెక్స్ ల్లో రెగ్యులర్ సీట్లకు రూ. 125, రిక్లైనర్ సీట్లకు రూ.250 ఉండాలని నిర్ణయించారు.
  3. నగర పంచాయతీ/ గ్రామ పంచాయతీ పరిధిలోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియమ్ రూ.20, ప్రీమియమ్ రూ.40గా నిర్ణయించారు. ఇక ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియమ్ రూ.50, ప్రీమియమ్ రూ.70గా చేశారు. స్పెషల్ కేటగిరీ థియేటర్లలో నాన్ ప్రీమియమ్ రూ. 70గానూ, ప్రీమియమ్ ను రూ. 90గానూ నిర్ణయించారు. మల్టీప్లెక్స్ ల్లో రెగ్యులర్ సీట్లకు రూ. 100, రిక్లైనర్ సీట్లకు రూ.250 ఉండాలని తీర్మానించారు.

మల్టీప్లెక్స్ ల్లోని రిక్లైనర్ సీట్లకు అన్ని ఏరియాల్లోనూ రూ.250 నిర్ణయించడం గమనార్హం! విశేషం ఏమంటే పై టిక్కెట్ రేట్లన్నీ కూడా జీఎస్టీ మినహాయించి ప్రకటించిన రేట్లు. అయితే ఏసీ థియేటర్లకు టిక్కెట్ పై ఐదు రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లకు టిక్కెట్ పై మూడు రూపాయలుగా ఇస్తున్న మెయిన్ టెనెన్స్ ఛార్జెస్ పై ధరల్లో కలిపే ఉన్నాయి.

చిత్రసీమ కోరిన విధంగా ఐదు ఆటలకు అనుమతి ఇస్తూ, ఆ ఆటల్లో ఉదయం 11 నుండి రాత్రి 9 లోపు ఓ ఆటను చిన్న సినిమాల కోసం కేటాయించాలని సూచించారు. అయితే పారితోషికాలతో కలిపి రూ. 20 కోట్ల మించి బడ్జెట్ కాని చిత్రాలనే ఈ కేటగిరి కింద పరిగణిస్తారు.

సీఎం జగన్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఇచ్చిన ప్రత్యేక హామీకి ఈ జీవోలో చోటు దక్కింది. నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు మినహాయించి కేవలం సినిమా నిర్మాణానికే రూ. 100 కోట్లు, అంతకు మించి వెచ్చించిన సినిమాలను ‘సూపర్ హై బడ్జెట్ మూవీస్’గా గుర్తిస్తామని, వాటికి మొదటి పది రోజులకు ధరలు పెంచుకునే అవకాశం ఇస్తామని తెలిపారు. అయితే ఈ చిత్రాల నిర్మాణంలో కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో జరగాలనీ నిబంధన విధించారు. వీటిని అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు, థియేటర్లకు పర్మిషన్ ఇచ్చే అథారిటీస్ తగిన చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

నగర, గ్రామ పంచాయితీల్లోని థియేటర్లకు దెబ్బ!
ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ రేట్లతో సినిమాలను నడపలేమంటే గ్రామాల్లోని కొన్ని థియేటర్లను యజమానులు, లీజుదారులు మూసేశారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ జీవో వల్ల కూడా వారికి పెద్దగా ఒదిగేదీ ఏమీ లేదని తెలుస్తోంది. థియేటర్లలో ప్రీమియర్ టిక్కెట్ 40, నాన్ ప్రీమియర్ టిక్కెట్ 20 పెట్టడం వల్ల వాళ్ళకు పెద్దగా కలిగే లాభం ఏమీ లేదు. పైగా మొదటి నుండి థియేటర్ల మెయిన్ టెనెన్స్ విషయంలో ఇప్పుడు నగరాలతో పోటీ పడి గ్రామాలలో థియేటర్లను నిర్వహించాల్సి వస్తోందని, డిజిటల్ ట్రాన్స్ మిషన్, పవర్ బిల్ రాష్ట్రమంతా ఒక్కటే ఉన్నందువల్ల తమ థియేటర్లలోనూ టిక్కెట్ రేట్లను పెంచాలని వారు కోరుతూ వచ్చారు. కానీ అది ఈ కొత్త జీవోలోనూ జరగలేదు. మొత్తంగా ఈ జీవో కారణంగా అత్యధిక లబ్దిపొందేది మల్టీప్లెక్స్ థియేటర్ల అధినేతలే!

Exit mobile version