Geethu Royal :బిగ్ బాస్ సీజన్ 6లోని కంటెస్టెంట్స్ అందరిలోకీ గీతు రాయల్ ది ఓ సపరేట్ స్టైల్. మనసులో ఏదీ దాచుకోకుండా ఏది అనిపిస్తే… అది ముఖాన అనేయడం ఆమెకు అలవాటు. దాంతో బిగ్ బాస్ హౌస్ లోని కొందరితో ఆమె బాగా కనెక్ట్ అయ్యింది, అదే సమయంలో కొందరితో అస్సలు కనెక్ట్ కాలేదు. అనేక సందర్భాలలో నాగార్జున హౌస్ లోని కంటెస్టెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకుని చివాట్లు కూడా తిన్నది. బాలాదిత్య – గీతు మధ్య చక్కని అండర్ స్టాండింగ్ ఉందని అందరూ భావిస్తున్న సమయంలో సిగరెట్ స్మోకింగ్ విషయంలో అతి చేసి, ఆడియెన్స్ అభిమానాన్ని గీతు పోగొట్టుకుంది. ఓ రకంగా బాలాదిత్య, గీతు మధ్య జరిగిన ఆ మాటల యుద్థం బాలాదిత్యకు తెలియకుండానే బాగా హెల్ప్ అయ్యింది. ‘ఇది నా స్ట్రేటజీ’ అని గీతు అన్నప్పటికీ… అక్కడ నుండి ఆమె ట్రాక్ తప్పినట్టు అయిపోయింది. ఆమె మనసెరిగి మసలుకునే ఆదిరెడ్డి సైతం గీతును తప్పు పట్టడంతో ఆమె డిఫెన్స్ లో పడిపోయింది. ఈ వారం గీతు ఎలిమిట్ అవ్వడానికి ఇవన్నీ ఓ రకంగా కారణమే. ఈ ఎలిమినేషన్ లో జన్యూనిటీ ఎంత ఉందనే విషయాన్ని పక్కన పెడితే, హౌస్ లో అరవ ఓవర్ యాక్షన్ చేసే గీతు… ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అదే ప్రవర్తన కనబర్చింది. ‘నేను టాప్ ఫైవ్ లో కూడా కాదు… విన్నర్ గా ఉండాలని అనుకున్నాను… ఎంతో మందిని మోటివేట్ చేయాలని అనుకున్నాను. ఈ ఎలిమినేషన్ నేనస్సలు ఊహించలేదు’ అంటూ శోకాలు పెట్టేసింది. ‘నేను ఈ హౌస్ నుండి బయటకు వెళ్ళను’ అంటూ నాగార్జున దగ్గర దీర్ఘాలు తీసింది. బిగ్ బాస్ లో రూల్ అంటే రూలే మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు అని నాగార్జున సముదాయించినా, స్టేజ్ మీద ఏడుస్తూనే ఉంది.
ఎలిమినేషన్ సమయంలో గీతు ఓవర్ యాక్షన్ చూసి చాలామంది నెటిజన్లు చికాకు పడ్డారు. ఈ అరవ ఓవర్ యాక్షన్ ఏమిట్రా దేవుడా! అనుకున్నారు. బిగ్ బాస్ షోలో రూల్స్ ప్రకారం హౌస్ నుండి ప్రతి వారం ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్ళాల్సిందే! ఏదో ఒక రోజు తమ వంతు కూడా వస్తుందని అందరికీ తెలుసు. అయితే కనీసం టాప్ ఫైవ్ లో అయినా ఉంటామని భావించిన వారు… తొందరగా ఎలిమినేట్ అయిపోతే బాధపడటం సహజం. బట్ గీతు తనదైన ఆట తీరుతో దాదాపు పది వారాల పాటు హౌస్ లో ఉంది. అయినా కానీ ఈ ఎలిమినేషన్ ఊహించలేదంటూ కన్నీరు మున్నీరు కావడం చాలామందికి నచ్చలేదు. దాంతో ‘ఇంట్లోంచి ఏదో పీనుగు లేచినట్టు ఆ ఏడుపులూ పెడబొబ్బలు ఏమిటీ?’ అంటూ కొందరు మండిపడ్డారు. అయితే…. గీతు ఈ వారం ఎలిమినేట్ అయ్యిందనే విషయం లీక్ కాగానే, చాలామంది ఆశ్చర్యపోయారు. గీతు ఇంత త్వరగా హౌస్ నుండి బయటకు వచ్చేస్తుందని వారెవరూ ఊహించలేదు. గీతూ మాట తీరు కఠినమైనా, ఆమె ఆట తీరు చాలా బాగుంటుందని వారంతా వ్యాఖ్యానించారు. ఇక గీతు లేని బిగ్ బాస్ షోను చూడటం వేస్టంటూ కూడా కొందరు వ్యాఖ్యానించడం విశేషం. ఇదిలా ఉంటే… గీతూను బిగ్ బాస్ కూడా అంత తేలికగా వదులుకోడని, ఆమెను సీక్రెట్ రూమ్ లో పెట్టి తిరిగి హౌస్ లోకి ఎంటర్ చేయించే ఛాన్స్ ఉందని కొందరు ఊహాగానాలూ చేస్తున్నారు.