తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నటి రమ్యకృష్ణకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తమిళ ప్రేక్షకులూ ఆమెను గొప్ప నటిగా కీర్తిస్తుంటారు. ‘నరసింహా’ తర్వాత నీలాంబరి అనేది రమ్యకృష్ణ కు పర్యాయ పదంగా మారిపోయింది. బహుభాషా నటిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ తొలిసారి ఓటీటీలో ఓ డాన్స్ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహిస్తున్నారు. ఆహాలో ‘డాన్స్ ఐకాన్ షో’ మొదలైంది. దీని ప్రీమియర్ ఫంక్షన్ ఆదివారం ప్రసారమైంది. రాబోయే 17వ తేదీ నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకూ ఆహా ఓటీటీలో ఈ షో ప్రసారం కానుంది. విశేషం ఏమంటే కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్, టెలివిజన్ టాప్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ ఓంకార్ సైతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ, ”డాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రమ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్యకాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఓ కొత్త రమ్యను అందరూ చూడబోతున్నారు” అని తెలిపింది. రమ్యకృష్ణ ఈ షోకు జడ్జిగా వ్యవహరించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఆమెతో కలిసి పనిచేయాలనే తన కల ఆహా అండ్ ఓక్ టీమ్ ద్వారా సాకారమైందని, ఈ డాన్స్ ఐకాన్ షోతో నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ వ్యూవర్స్ కు దొరుకుతుందని ఓంకార్ అన్నాడు. రమకృష్ణకు డాన్స్ పై అద్భుతమైన అవగాహన ఉందని, ఆమె జడ్జిగా ఈ షోకు వ్యవహరించడం సంతోషాన్ని కలిగిస్తోందని ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ చెప్పారు. రొటీన్ డాన్స్ షోస్ కు భిన్నంగా రూపుదిద్దుకుంటున్న డాన్స్ ఐకాన్ షో ఏ స్థాయి ఆదరణ పొందుతుందో చూడాలి.