Site icon NTV Telugu

ఈ జనవరి మాసం ‘బంగార్రాజు’దే!

చూస్తుండగానే కొత్త సంవత్సరం మొదటి మాసం గడిచిపోతోంది. 2022కు పాన్ ఇండియా సినిమాలతో శుభారంభం జరుగుతుందని సినీజనం భావించారు కానీ వారి అంచనాలన్నీ తల్లకిందులు చేస్తూ ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ వంటి సినిమాల విడుదల వాయిదా పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్రాంతి సీజన్ పూర్తి కాగానే యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. విడుదలైన సినిమాలకు అనుకున్న రీతిలో ఆదరణ దొరక్కపోవడం, నెలాఖరులో పెద్ద సినిమా ఒక్కటీ విడుదల కాకపోవడంతో మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు సైతం ప్రదర్శనలను రద్దు చేసుకున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎం.ఎం., అంబర్ పేట శ్రీరమణ 35 ఎం.ఎం.తో సహా పలు థియేటర్లలో సినిమాల స్క్రీనింగ్ కు బ్రేక్ పడింది.

జనవరి మాసంలో విడుదలైన సినిమాల విషయానికి వస్తే… కొత్త సంవత్సరం మొదటి రోజే వరుణ్‌ సందేశ్ ‘ఇందువదన’ సినిమాతో పాటు దిశ హత్య నేపథ్యంలో ఆర్జీవి తీసిన ‘ఆశ’ సినిమా జనం ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఏడవ తేదీ ఆది సాయికుమార్ ‘అతిథి దేవోభవ’, రానా ‘1945’, శివాజీ రాజా తనయుడు విజయ్ ‘వేయి శుభములు కలుగు నీకు’ చిత్రాలతో పాటు ‘హాఫ్ స్టోరీస్’ మూవీ విడుదలైంది. ఈ చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చెప్పుకోదగ్గది, ఈ నెలలో విజయకేతనం ఎగరేసిన చిత్రం నాగార్జున ‘బంగార్రాజు’. ఆరేళ్ళ క్రితం సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్నినాయన’తో దిగిన నాగార్జున అప్పుడు చక్కని విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన ‘బంగార్రాజు’తో మరోసారి తన సత్తా చాటాడు. ఈసారి నాగార్జునతో పాటు నాగచైతన్య సైతం చేయి కలపడం విశేషం. ఈ సినిమాతో పాటు 14వ తేదీ ‘దిల్’ రాజు సోదరుడు శిరీశ్ తనయుడు ఆశిష్‌ హీరోగా నటించిన ‘రౌడీ బాయ్స్’ విడుదలైంది. అలానే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్ ‘సూపర్ మచ్చి’ కూడా వచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ రాలేదు కానీ ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి ప్రభావం చూపింది. ఆ మర్నాడే అంటే జనవరి 15వ తేదీ కృష్ణ మనవడు, మహేశ్ మేనల్లుడు, అశోక్ గల్లా హీరోగా పరిచయమైన ‘హీరో’ మూవీ విడుదలైంది. ప్రేక్షకులకు వినోదాల విందును అందించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు కానీ దీనిని చూసిన వాళ్ళకు కాస్తంత సంతృప్తి అయితే దక్కింది. ఇటు ఆశిష్, అటు అశోక్ ఇద్దరూ కూడా మున్ముందు మరిన్ని సినిమాలు చేయడానికి వారి తొలి చిత్రాలు కొంతమేరకు దోహదం చేశాయని చెప్పాలి. నిజానికి వీరి పెద్దలు సైతం లాభాల కంటే… తమ పిల్లలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వెళ్ళి, మంచి గుర్తింపు పొందితే చాలు అనే భావనతోనే ఈ చిత్రాలను భారీగా తీసి, విడుదల చేశారు. ఆ మేరకు వారికి కొద్ది పాటి తృప్తి లభించిందని అనుకోవచ్చు.

ఇక ఆ తర్వాత వారం ఆశిష్‌ గాంధీ ‘ఉనికి’, ‘వధుకట్నం’ సినిమాలు విడుదలయ్యాయి. అలానే నట్టికుమార్ స్వీయ దర్శకత్వంలో తన కొడుకు క్రాంతిని హీరోగా పెట్టి తీసిన ‘సైకో వర్మ’ సైతం రిలీజైంది. విశేషం ఏమంటే… నట్టికుమార్ తన కుమార్తె తో తీసిన ‘దెయ్యంతో సహజీవనం’ మూవీ సైతం ఆ తర్వాత వారమే జనం ముందుకు వచ్చింది. ఆ రకంగా నట్టికుమార్ ఇటు తన కొడుకును, అటు తన కూతురును బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ అక్కా తమ్ముళ్ళు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయారు. ఇక జనవరి 22న ‘పద్మశ్రీ’, 26న బంజారా చిత్రం ‘గోర్ మాటి’ విడుదలయ్యాయి. ఈ రెండూ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. జనవరి 28న కీర్తి సురేశ్‌ ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలు రిలీజైంది. ఎంతోకాలంగా ఇదిగో అదిగో అనిపించిన ‘గుడ్ లక్ సఖి’ జనం ముందుకైతే వచ్చింది కానీ… ఎలాంటి ప్రభావం చూపలేదు. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అంటూ ప్రేక్షకులు ఈ మూవీని తిరస్కరించారు. జనవరి మాసంలో 17 స్ట్రయిట్ సినిమాలు విడుదల కాగానే ఒకే ఒక్క డబ్బింగ్ చిత్రం వచ్చింది. అది మలయాళ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’. మమ్ముట్టి, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ డబ్బింగ్ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఓవర్ ఆల్ గా ఈ 18 సినిమాలలో ఒక్క ‘బంగార్రాజు’ మాత్రమే కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటి వరకూ యాభై కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త సంవత్సరం తొలి మాసం ఏమాత్రం ఆశాజనకంగా లేదనేది సినీజనం చెబుతున్న మాట. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు సైతం వాయిదా పడిపోయాయి. ఫిబ్రవరి 4న యండమూరి ‘అతడు ఆమె ప్రియుడు’, ‘స్వ’, ‘రియల్ దండుపాళ్యం’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇక మచ్ అవౌటెడ్ మూవీ, మాస్ మహరాజా రవితేజ నటించిన ‘ఖిలాడి’ 11వ తేదీ వస్తోంది. ఈ సినిమాకు క్రేజీ బిజినెస్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి రావాల్సిన సిద్ధు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’ సైతం 11వ తేదీనే వస్తుందని అంటున్నారు. అదే వారం జీ 5లో సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’, ఆహాలో ప్రియమణి ‘భామాకలాపం’ డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక ఆ నెల ద్వితీయార్థంలో శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ విడుదల అవుతోంది. అలానే అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ కూడా రిలీజ్ ఉంది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తామని అన్నారు. మరి ఇప్పుడు ఆలోచన విరమించుకున్నారా అనేది తెలియదు. ఇవి కాకుండా విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాలు మరి కొన్ని ఉన్నాయి. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించినా వాటిని జనం ముందుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో చూడాలి!!

Exit mobile version