Site icon NTV Telugu

మరోమారు నాన్నతో నాగచైతన్య!

తండ్రి నాగార్జున అక్కినేనితో మరోమారు నాగచైతన్య కలసి నటిస్తున్నాడు. వీరిద్దరూ నటించే చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలయింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ తెరకెక్కనుంది. 2016 సంక్రాంతి సందడిలో తనదే పైచేయి అని ‘సోగ్గాడే చిన్నినాయనా’ చాటుకుంది. ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ అంటే అక్కినేని అభిమానులకు పండగే మరి! పైగా ఇందులో నాగచైతన్య కూడా నాగార్జునతో కలసి నటించడమంటే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకాయే! ఇంతకు ముందు నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన ‘మనం’ సూపర్ హిట్! ఈ నేపథ్యంలో ‘బంగార్రాజు’పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొనడంలో సందేహమే లేదు.

అక్కినేని అభిమానులకు ‘మనం’ చిత్రం ఓ మరపురాని మధురానుభూతిని కలిగించింది. ఎందుకంటే, ఇందులో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో పాటు ఆయన నటవారసులు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలసి నటించారు. ఏయన్నార్ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘మనం’ మరచిపోలేని మధురానుభూతిని అభిమానుల సొంతం చేసింది. ఇందులో అక్కినేని అమల, సమంత కూడా నటించడం మరింత విశేషం. మరి ఈ సారి రాబోయే ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్య మాత్రమే ఉంటారా? ‘మనం’లో లాగా అక్కినేని ఫ్యామిలీ యాక్టర్స్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా? ఇలాంటి ఆలోచనలు సైతం అభిమానుల మదిలో చిందులు వేస్తున్నాయి. మరి ‘బంగార్రాజు’ ఏ తీరున మురిపిస్తాడో చూడాలి.

Exit mobile version