NTV Telugu Site icon

Naga Babu: విలక్షణమే నాగబాబుకు సలక్షణం!

Nagababu

Nagababu

Naga Babu:చిరంజీవి తమ్ముడు అనే ముద్ర నుండి బయటపడి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నాగబాబు. నటనిర్మాతగా తనదైన బాణీ పలికించిన నాగబాబు తన సోషల్ మీడియా ద్వారా కూడా సదా వార్తల్లో నానుతూ ఉంటారు. ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ ధరిస్తూ బిజీగా సాగుతున్నారు నాగబాబు.

కొణిదెల నాగేంద్రబాబు 1961 అక్టోబర్ 29న మొగల్తూరులో జన్మించారు. చిన్నతనం నుంచీ అన్న చిరంజీవికి తోడుగా సాగుతుండేవారు నాగబాబు. ఎల్.ఎల్.బి. చదువుకున్న తరువాత మద్రాసులో అన్న చెంతకు చేరారు. నాగబాబు ఒడ్డూ పొడుగూ చూసి అతనిలోనూ ఓ నటుడున్నాడని భావించారు నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. అలాగే అన్నయ్య ప్రోత్సాహం ఎలాగూ ఉంది. అలా వారందరి కలయికలో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రంలో సింహం పాత్రలో తొలిసారి నటించారు నాగబాబు. ఆ సినిమా తరువాత తమకు జన్మనిచ్చిన తల్లి పేరు మీద ‘అంజనా ప్రొడక్షన్స్’ అనే సంస్థను నెలకొల్పారు. అన్న చిరంజీవి హీరోగా కె.బాలచందర్ దర్శకత్వంలో ‘రుద్రవీణ’ చిత్రాన్ని తొలిగా నిర్మించారు నాగబాబు. ఆ సినిమాతోనే నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు. తన అన్నకు మాస్ లో ఎంతో ఇమేజ్ ఉన్నా, మసాలా మూవీ తీయకుండా, అభ్యుదయ భావాలతో ‘రుద్రవీణ’ నిర్మించారు. ఈ సినిమా ఉత్తమ సమైక్యతా చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఇక ఈ సినిమాకు స్వరకల్పన చేసిన ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకునిగా నేషనల్ అవార్డు సంపాదించి పెట్టింది. ఉత్తమగాయకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు జాతీయ అవార్డును అందించింది. అలాగే ఈ సినిమా నాలుగు నంది అవార్డులనూ సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ అవార్డులు సంపాదించిన ‘రుద్రవీణ’ ప్రేక్షకుల రివార్డులు మాత్రం అంతగా దక్కించుకోలేకపోయింది. తరువాత చిరంజీవి నూరవ చిత్రంగా రూపొందిన ‘త్రినేత్రుడు’ను కూడా నాగబాబు నిర్మించారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ చూసింది. అన్న హీరోగా రూపొందిన “మరణ మృదంగం, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ” చిత్రాలలో నాగబాబు కీలక పాత్రలు పోషించారు. తరువాత ‘సూపర్ ఎక్స్ ప్రెస్’తో హీరో అయ్యారు. ‘420’లోనూ కథానాయకునిగా నటించారు. తరువాత తన పర్సనాలిటీకి తగ్గ పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగారు నాగబాబు.

ఓ వైపు నటిస్తూనే, మరోవైపు తమ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై చిత్రాలు నిర్మిస్తూ సాగారు నాగబాబు. అన్న హీరోగా “ముగ్గురు మొనగాళ్ళు, బావగారూ బాగున్నారా, స్టాలిన్” చిత్రాలను నిర్మించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ‘గుడుంబా శంకర్’ తెరకెక్కించారు. అన్న కొడుకు రామ్ చరణ్ హీరోగా ‘ఆరెంజ్’ నిర్మించారు. అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ రూపొందించారు. ఇక తానే ప్రధాన పాత్ర పోషిస్తూ 2000 సంవత్సరంలో ‘కౌరవుడు’ కూడా నాగబాబు నిర్మించారు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే “అపరంజి, శిఖరం, నాన్న కూచి” వంటి టీవీ సీరియల్స్ లోనూ కీలక పాత్రలు ధరించారు నాగబాబు. ఇక బుల్లితెరపై “జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్” కార్యక్రమాల్లో జడ్జ్ గానూ కనిపించి ఆకట్టుకున్నారు.

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన కూతురు నిహారిక సైతం తండ్రి బాటలో పయనించి, కొన్ని చిత్రాలలో నటించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు నాగబాబు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి నాగబాబు ఓటమి చవిచూశారు. ఇప్పటికీ తన తమ్ముడు ఏ రోజుకైనా విజయం సాధిస్తారు అనే విశ్వాసంతో ఉన్నారు నాగబాబు. తమ్ముని వెంటే రాజకీయ సమావేశాల్లోనూ పాల్గొంటూ పాలిటిక్స్ లోనూ చురుగ్గా ఉన్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.

Show comments