Site icon NTV Telugu

Krishna Vrinda Vihari : నాగశౌర్య చెప్పిన కొత్త లెక్క 2+2= 22!

Krishna-Vrinda-Vihari

నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’! ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చిన ఈ మూవీ టీజర్ ను సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు అనీశ్‌ ఆర్ కృష్ణ మాట్లాడుతూ, ”ఈ సినిమా కథను 2020 ఫిబ్రవరి 18న నాగశౌర్యకు చెప్పాను. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తమ సొంత బ్యానర్ లోనే తీస్తానని అన్నారు. అయితే కరోనా రావడంతో మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. అదే ఏడాది డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టి కొంత చేసేసరికీ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో మళ్ళీ బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఈ యేడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తి చేశాం. ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నాం. ఇవాళ టీజర్ లో మీరు చూసిన దానికంటే మించిన రొమాన్స్ మూవీలో ఉంటుంది. దానిని మించిన ఎంటర్ టైన్ మెంట్ లభిస్తుంది. వేసవి సీజన్ లో వస్తున్న తుపాకుల వంటి సినిమాల మధ్య రోజ్ లాంటి చిత్రమిది” అని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ‘మచ్చ’ రవి మాట్లాడుతూ, ”ఈ బ్యానర్ కు నేను పెద్ద ఫ్యాన్. తన కుమారుడు నాగశౌర్య కంటే మూవీ మేకింగ్ మీద ఉషగారికి ఎక్కువ ప్రేమ. అదే ఈ బ్యానర్ యు.ఎస్.పి.! హ్యూజ్ మాస్ సినిమా మధ్య ఓ మల్లెతీగలా ఉండే ఈ సినిమాను జనం ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు. టాలీవుడ్ లోకి ఈ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్న షిర్లీ సెటియా మాట్లాడుతూ, ”నాకిది మొదటి సినిమా. దీనితో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అందరి సహకారంతో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను” అని తెలిపింది. ‘ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన అనిల్ రావిపూడి చిత్రాలకు తాను పెద్ద ఫ్యాన్’ అని చిత్ర నిర్మాత ఉష తెలిపారు.

Read Also : Charmme Kaur @ 20 Years : ఇరవై ఏళ్ళ ఛార్మి!

హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ”ప్రభాస్, ఎన్టీయార్ సినిమాల తరహాలో రెండు మూడేళ్ళు సాగే పెద్ద ప్రొడక్షన్ ఏదైనా చేయాలనే కోరిక ఉండేది. కరోనా కారణంగా ఈ సినిమాతో అది మరోలా తీరింది. ఈ సినిమా టైటిల్ లో వ్రింద అనే పదం కరెక్ట్ కాదని కొందరు చెప్పారు. సినిమా చూస్తే ఆ పదాన్ని ఎందుకు పెట్టామో అర్థమౌతుంది. ఓ గ్రాండ్ సక్సెస్ ఫుల్ మూవీ తీయాలన్నది మా అమ్మగారి కోరిక. అది ఈ సినిమాతో నిజం అవుతుందనే నమ్మకం ఉంది. దర్శకుడు అనీశ్ చెప్పిన కథను చెప్పినట్టు తీశాడు. అందుకోసం ఎంతో శ్రమించాం. గతంలో ఏదైనా సినిమాకు రీ-షూట్ చేస్తే పోయిందని జనం అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు రీ-షూట్ చేయకపోతే పోతుందనే భావన చాలా మందికి వచ్చింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అందరికీ నచ్చడం కోసం రీ-షూట్ చేశాం. ఏప్రిల్ 22న సినిమా విడుదల అవుతోంది. టూ ప్లస్ టూ అంటే ఫోర్ మాత్రమే కాదు… 22 కూడా! ఈ సినిమా అంతలా జనాన్ని ఆకట్టుకుంటుంది” అని చెప్పారు.

చివరగా ముఖ్యఅతిథి అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ”గత నాలుగు రోజులుగా ‘ట్రిపుల్ ఆర్’ కారణంగా థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. అంత ఘనవిజయాన్ని ఆ చిత్రానికి ప్రేక్షకులు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే… ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే ఎంతో ఇష్టం. మా టెక్నీషియన్స్ చాలామంది ఈ సినిమాకు వర్క్ చేశారు. నిర్మాతల ఆదరణ గురించి, కమిట్ మెంట్ గురించి తరచూ నాతో చెబుతుండేవారు. ఇలాంటి వారికి మంచి విజయం దక్కాలి. నాగశౌర్య ఎవరి సహకారం లేకుండా స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగాడు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి వెళతాడనే నమ్మకం ఉంది. ఈ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను” అని అన్నారు.

Exit mobile version