Naga Shaurya Hospitalised Due To Health Issues: టాలీవుడ్‌లో తాజాగా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. షూటింగ్ స్పాట్‌లోనే యువ హీరో నాగశౌర్య కుప్పకూలాడు. సోమవారం అతని లేటెస్ట్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. స్పాట్‌లోనే ఉన్నట్లుండి శౌర్య సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే అతడ్ని హైదరాబాద్‌లోనీ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది. డీ హైడ్రేషన్ వల్లే నాగశౌర్య కుప్పకూలినట్లు తేలింది. ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్సను అందిస్తున్నారు. 105 జ్వరంతో షూటింగ్ లో పాల్గొనటమే అందుకు కారణంగా తెలుస్తోంది.
ఇంతకుముందు కూడా నాగశౌర్య ఓసారి షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. తన అశ్వథ్థామ చిత్రీకరణలో భాగంగా.. వైజాగ్‌లో ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు, అతని కాలికి గాయమైంది. ఆ సమయంలో వైద్యం అందించిన డాక్టర్లు.. మోకాలికి తీవ్ర గాయమైందని, నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గాయంతో పూర్తిగా కోలుకున్నాక, తిరిగి షూట్‌లో పాల్గొన్నాడు. అయితే.. ఈసారి ప్రమాదాలేమీ సంభవించలేదు. ఉన్నట్లుండి శౌర్య సొమ్మసిల్లి పడిపోవడంతో, కుటుంబ సభ్యులతో పాటు యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. లక్ష్య సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ చేయడం, దాన్ని కంటిన్యూ చేయడం కోసం డైట్ పాటిస్తున్నాడు కాబట్టి, అదే ఇతని ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండొచ్చని తెలుస్తోంది. మరికాసేపట్లో అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
ఇదిలావుండగా.. నాగ శౌర్య రీసెంట్‌గా కృష్ణ వింద విహారి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. అది మంచి విజయం సాధించడంతో, ఆ ఊపులో శౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతని చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇతను దాదాపు కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇందులో యుక్తి థారేజ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు.. నాగశౌర్య బెంగళూరుకి చెందిన అనూష శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి వివాహం ఈనెల 20వ తేదీన ఉదయం 11:25 గంటలకు జరగనుంది.