NTV Telugu Site icon

Custody: సినిమా చూశా… నమ్మకంతో ఉన్నా: నాగచైతన్య

Nc

Nc

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన సినిమా ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా విజయంపై నాగచైతన్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, “నేను ప్రతి సినిమాకు రెండు నెలలు వర్క్‌ షాప్‌ చేస్తాను. క్యారక్టర్‌ ఎలావుండాలి అనేవి కథలోని కొన్ని సీన్స్‌ ను 5డి కెమెరాతో షూట్‌ చేస్తాం. ఈ కథ పరంగా కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను పరిశీలించాను. కొంతమందిని కలిశాను. ఇలాంటివి కొంతమంది దర్శకులు ఎంకరేజ్‌ చేస్తారు. అలా వెంకట్‌ ప్రభు నాకు ఫ్రీడమ్‌ ఇచ్చారు. నేను కానిస్టేబుల్‌గా నటించాను. నా పాత్రపరంగా వెంకట్‌ప్రభుగారు చెప్పింది చెప్పినట్లు తీశారు. నేనూ పూర్తి న్యాయం చేశాను. ఎంజాయ్‌ చేస్తూ చేసిన పాత్ర ఇది. అలానే పోలీసు కానిస్టేబుళ్లను కలిశాక, వారి కష్టాలు విన్నాక నాకే ఇన్స్పయిరింగ్ గా అనిపించింది. ఇందులో యాక్షన్‌ సీన్స్‌ చాలా నాచురల్‌ గా వుంటాయి. ఫైట్‌ మాస్టర్లతో రిహార్సల్స్‌ చేశాక షూట్‌ కు వెళ్ళాం. పైకి ఎగిరే సన్నివేశాలు, అండర్‌ వాటర్‌ వంటి సీన్స్‌ వారితో చర్చించాక చేసినవే” అని అన్నారు.

వెంకట్ ప్రభు గురించి చెబుతూ, “ఆయన డైరెక్ట్ చేసిన ‘మానాడు’ సినిమాకు ముందే ‘కస్టడీ’ కథ ఓకే అయింది. ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. వెంకట్‌ ప్రభుగారి స్క్రీన్‌ప్లే చాలా వెరైటీగా వుంటుంది. ‘మానాడు’లో చాలా కన్‌ఫ్యూజ్‌ పాయింట్‌ ను తేలిగ్గా చూపించేశారు. ఆయన మెచ్చూర్డ్‌ డైరెక్టర్‌. ఆయన చెప్పిన ఈ కథ నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది, అందుకే చేశాను. మొన్ననే ఆర్‌.ఆర్‌. అన్నీ అయ్యాక థియేటర్‌ లో సినిమా చూశాను. మంచి మూవీ ఇవ్వబోతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఏ రేంజ్‌లో వుంటుందనేది ప్రేక్షకుల తీర్పును బట్టి వుంటుంది” అని చెప్పారు. ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం పట్ల నాగచైతన్య హర్షం వ్యక్తం చేశారు. నటుడికి వాయిస్ ముఖ్యమని, అందుకే తమిళంలో తానే డబ్బింగ్ చెప్పానని అన్నారు.

సీనియర్ నటులు శరత్‌కుమార్‌, ప్రియమణి, అరవింద్‌ స్వామి లాంటి వారితో నటించిన అనుభవం గురించి చెబుతూ, “ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో ఈ ముగ్గురి మధ్య నలిగిపోతాను. అదే సినిమాకు హైలైట్‌. అందుకే లుక్‌ పరంగా డిఫరెంట్‌ గా కనిపిస్తాను. సైజ్‌ కూడా తగ్గాను. ఫిట్‌ కానిస్టేబుల్‌ ఎలా వుంటాడో అలా నన్ను నేను మార్చుకున్నాను. హీరోయిన్ కృతిశెట్టి ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా పండించింది. నటిగా చాలా మెచ్యూర్డ్‌. తమిళం బాగా నేర్చుకుంది” అని కితాబిచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా సీక్వెల్ ఉంటుందని చెబుతూ, ‘అందరూ పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు, నా టార్గెట్ ఆడియెన్స్ మాత్రం తెలుగు, తమిళ వారే’ అని నాగచైతన్య అన్నారు.