NTV Telugu Site icon

వాణికి తగ్గ బాణీలు పలికించిన శ్రీ!

(సెప్టెంబర్ 13న సంగీత దర్శకుడు శ్రీ జయంతి)

చిత్రసీమలో ఎందరో కళాకారుల వారసులు తమదైన బాణీ పలికించారు. సంగీత దర్శకుల వారసులు మన తెలుగు సినిమా రంగంలో అరుదుగానే కనిపిస్తారు. వారిలో చక్రవర్తి తనయుడు శ్రీనివాస చక్రవర్తి ఒకరు. తొలుత తండ్రి స్వరకల్పనలో గాయకునిగా పరిచయమైన శ్రీనివాస్ ఆ తరువాత శ్రీ పేరుతో సంగీత దర్శకునిగానూ అలరించారు. ఒకటిన్నర దశాబ్దం పాటు తెలుగు చిత్రసీమ సంగీత సామ్రాజ్యాన్ని చక్రవర్తి మకుటం లేకుండానే ఏలారు. ఏడాదికి వచ్చే చిత్రాలలో ఎనభై శాతం సినిమాలు చక్రవర్తి బాణీల్లోనే రూపొందేవి. అంతటి సంగీత దర్శకుని తనయుడు శ్రీ ఆ స్థాయిలో రాణించక పోయినా, తనదైన బాణీలతో సాగారు.

కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి 1966 సెప్టెంబర్ 13న జన్మించారు. మదరాసులో స్కూల్ చదువు పూర్తి చేసుకున్న శ్రీ తరువాత మణిపాల్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్నారు. తండ్రి వద్ద కొంతకాలం అసోసియేట్ గా పనిచేశారు. చక్రవర్తి స్వరాలు ఆ రోజుల్లో కుర్రకారును ఎంతగానో కిర్రెక్కించాయి. అలా చక్రవర్తి సంగీతం విని అభిమానులుగా మారిన కొందరు తరువాతి రోజుల్లో ఆయన తనయుడు శ్రీతో బాణీలు కట్టించుకున్నారు. వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. వర్మ నిర్మాతగా రూపొందిన తొలి చిత్రం ‘మనీ’కి శ్రీ సంగీతం సమకూర్చారు. ఇందులోని “చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకు బంధువవుతానంది మనీ…”, “వారెవ్వా ఏమి ఫేసూ… అచ్చు హీరోలా ఉంది బాసూ…” వంటి పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాతో శ్రీకి మంచి పేరు లభించింది. అవకాశాలు వెల్లువలాగే వచ్చాయి. ఎందువల్లో తండ్రిలా దూకుడు చూపించలేక పోయారు శ్రీ. తనకు నచ్చిన చిత్రాలనే ఎంపిక చేసుకొని సాగారు. రామ్ గోపాల్ వర్మ అనుబంధం ఉన్న చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు శ్రీ. “గాయం, మనీ మనీ, అనగనగా ఒకరోజు” సినిమాల్లో శ్రీ సంగీతం ఎంతగానో అలరించింది. ‘గాయం’ కోసం సీతారామశాస్త్రి రాసి, తెరపై అభినయించిన “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని…” పాట ఆ రోజుల్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణవంశీ నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘సిందూరం’కు కూడా శ్రీ బాణీలు కట్టారు. అందులోని “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నీ స్వతంత్రమందామా…” పాట కూడా ఆ నాటి యువకులను ఎంతగానో ఆకర్షించింది. నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆవిడా మా ఆవిడే’లోనూ శ్రీ స్వరాలు భలేగా సాగాయి. ఇక గ్రాఫిక్ మాయాజాలంగా రూపొందిన ‘అమ్మోరు’ సినిమా పాటలతో పాటు, నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నారు శ్రీ.

శ్రీ సంగీతంలో మరికొన్ని చిత్రాలు వెలుగు చూసినా, అంతగా అలరించలేకపోయాయి. తెలుగునాట తొలి పాప్ గాయనిగా నిలచిన స్మిత పాటకు ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ లో స్వరాలు కూర్చింది శ్రీనే. ఒకానొక దశలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు శ్రీ అని ఎందరో ప్రశంసించారు. కానీ, అది జరగలేదు. పిన్నవయసులోనే 2015 ఏప్రిల్ 18న ఆయన అనారోగ్య కారణంగా కన్నుమూశారు. శ్రీ స్వరకల్పనలో రూపొందిన చిత్రాలు కొన్నే. అయితే, వాటిలోనూ మధురాన్ని అందించాలని, తన మార్కు చూపించాలని శ్రీ ప్రయత్నించిన తీరు మరపురానిది.