NTV Telugu Site icon

MM Keeravaani Birthday: ఆస్కారుడు కీరవాణి రాగాల పల్లకిలో.. సదా మధురమే

Mm Keeravaani

Mm Keeravaani

MM Keeravaani Birthday Special: కీరవాణి పేరు ఈ తరానికి ప్రత్యేకించి పరిచయం చేయవలసిన పనిలేదు. ప్రపంచం దశదిశలా విజయశంఖారావం పూరించిన ‘బాహుబలి’ సీరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలు కీరవాణి స్వరకల్పనలోనే ప్రాణం పోసుకున్నాయి. అంతకు ముందు టాప్ స్టార్స్ అందరికీ మరపురాని మధురమైన సంగీతాన్ని అందించి, వారి అభినయానికి తన బాణీలు జోడించి, వారి చిత్రాలను విజయతీరాలకు చేర్చిన ఘనత కీరవాణి సొంతం. ఆయన ఇంటిపేరు కోడూరు. పూర్తి పేరు మరకతమణి కీరవాణి.

కీరవాణి 1961 జూలై 4న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు. ఆయన తండ్రి శివశక్తిదత్తకు లలితకళలంటే ప్రాణం. చిత్రలేఖనంలో విశేషమైన ప్రావీణ్యం ఉన్న శివశక్తిదత్తకు మహానటుడు యన్టీఆర్ నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రంలోని పాటలంటే ఎంతో అభిమానం. ఆ చిత్ర సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు బాణీలన్నా ఆయనకు ఎంతో ప్రాణం. రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన ‘విప్రనారాయణ’ చిత్రంలోని “ఎందుకోయి తోటమాలీ…” పాటను విని పరవశించి పోయారు శివశక్తిదత్త. తరువాత కొంతకాలానికి రాజేశ్వరరావును కలసి, ఆ పాటంటే తనకెంతో అభిమానమని చెప్పారు. ‘అది కీరవాణి రాగంలో చేసిన పాట’ అని రాజేశ్వరరావు చెప్పారు. తనకు సంతానం కలిగితే ‘కీరవాణి’ అని పేరు పెడతానని అన్నారు శివశక్తిదత్త. అది విని రాజేశ్వరరావు నవ్వి, ‘అమ్మాయయితే ‘కీరవాణి’ పేరు బాగుంటుంది. మరి అబ్బాయి పుడితేనో!?’ అని సందేహం వెలిబుచ్చారు. ఎవరు పుట్టినా సరే, ‘కీరవాణి’ అనే పేరు పెడతానని శివశక్తిదత్త చెప్పారు. చెప్పడమే కాదు తన తొలి సంతానంగా జన్మించిన అబ్బాయికి కీరవాణి అని పేరు పెట్టారు. ఆ కీరవాణియే నేడు చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనదైన బాణీ పలికిస్తూ జైత్రయాత్ర చేస్తున్నారు.

కీరవాణిరాగం పేరును తనయునికి ఏ ముహూర్తాన పెట్టారో శివశక్తిదత్త, మూడేళ్ళ ప్రాయంలోనే కీరవాణి ఇంట్లోని గ్లాసులపై పెన్సిల్‌తో జలతరంగిణి వాయించేవారట. ఆ తరువాత నుంచీ ఏవో కూని రాగాలు తీయడం, అందుకు తగ్గట్టుగా దరువులు వేయడం చేసేవారట. కీరవాణిలోని సంగీతాభిలాష గమనించిన తండ్రి తనకున్న పరిజ్ఞానంతో తనయునికి కొన్ని సంగీత పాఠాలు నేర్పారు. ఆ పైన నిష్ణాతులైన గురువుల వద్ద తనయుడు సాధన చేసేలా చూశారు శివశక్తిదత్త. తరువాత సినిమా సంగీతంలో రాణించాలని, చక్రవర్తి వద్ద అసోసియేట్ గా చేరారు. ఆయన వద్ద మూడేళ్ళు పనిచేసిన తరువాత కీరవాణి సొంతగా బాణీలు కట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. కృష్ణంరాజు సోదరుడు యు.సూర్యనారాయణరాజు తమ ‘కల్కి’ చిత్రం కోసం కీరవాణితో బాణీలు కట్టించారు. ఆ తరువాత ఎందుకనో, ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. రామోజీరావు నిర్మించిన ‘మనసు-మమత’ చిత్రంతో కీరవాణి సంగీత దర్శకునిగా జనం ముందు నిలిచారు.

క్రాంతికుమార్ తాను తెరకెక్కించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’కు స్వరకల్పన చేసేందుకు కీరవాణిని ఎంచుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రామోజీరావు తమ “అమ్మ, పీపుల్స్ ఎన్ కౌంటర్, అశ్విని” చిత్రాలకు కూడా కీరవాణి సంగీతానికి అవకాశం కల్పించారు. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ ‘క్షణ క్షణం’కు కూడా కీరవాణి స్వరరచన చేశారు. ఈ సినిమాతో కీరవాణి సంగీతానికి మరింత మంచి పేరు లభించింది. ఆపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘరానామొగుడు’ చిత్రానికి కీరవాణి స్వరకల్పన చేసిన బాణీలు విశేషాదరణ పొందాయి. ఇక కీరవాణి మరి వెనుదిరిగి చూసుకోలేదు. వందలాది చిత్రాలకు సంగీతం సమకూర్చి ఈ నాటికీ సంగీతప్రియులకు ఆనందం పంచుతూనే ఉన్నారు కీరవాణి. మహానటుడు యన్టీఆర్ చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కు కీరవాణి బాణీలు చేసిన సందడి ఎవరు మరచిపోగలరు?

కీరవాణి ఇంట్లోని వారందరికీ మహానటుడు యన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. వారికి యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’ అంటే మరింత అభిమానం. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటించిన పలు చిత్రాలకు కీరవాణి స్వరకల్పన చేశారు. వాటిలో ‘బొబ్బిలిసింహం’ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ బయోపిక్ గా బాలకృష్ణ నిర్మించి, నటించిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాలకు కూడా కీరవాణి స్వరకల్పన చేయడం విశేషం. ఇక ఎన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య’ చిత్రాలకు కూడా కీరవాణి సంగీతం సమకూర్చారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, తారకరామ్ (జూ.ఎన్టీఆర్) చిత్రాలకు కూడా కీరవాణి వినసొంపైన సంగీతం అందించారు. నందమూరి నటవంశం మూడోతరం హీరోలు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్, తారకరత్న చిత్రాలకు సైతం కీరవాణి బాణీలు మ్యూజికల్ హిట్స్ అందించడం విశేషం.

కీరవాణికి సంగీత దర్శకునిగా మంచి పేరు సంపాదించి పెట్టిన తొలి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఆయన నటించిన పలు చిత్రాలకు కూడా కీరవాణి స్వరరచన చేశారు. ఏయన్నార్ నటవారసుడైన నాగార్జున నటించిన చిత్రాలకు సైతం కీరవాణి మరపురాని సంగీతం సమకూర్చారు. నాగార్జునతో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘అన్నమయ్య’ చిత్రంతోనే కీరవాణికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు లభించడం మరపురాని అంశం. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కీరవాణిది ప్రత్యేక బంధం. వారిద్దరి కలయికలో అనేక మ్యూజికల్ హిట్స్ వెలుగు చూశాయి.

తమిళనాట మరకతమణి పేరుతోనూ, బాలీవుడ్ లో క్రీమ్ పేరుతోనూ సంగీతం సమకూర్చారు కీరవాణి. అక్కడా ఆయన అభిమానులు కీరవాణి కొత్త చిత్రాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కీరవాణి పినతండ్రి విజయేంద్ర ప్రసాద్ తనయుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటి దాకా తాను రూపొందించిన అన్ని చిత్రాలకూ అన్న కీరవాణితోనే స్వరకల్పన చేయించారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ లోనూ కీరవాణి స్వరవిన్యాసాలు భలేగా సాగాయి. ముఖ్యంగా ‘కొమురం భీముడో’, ‘నాటు నాటు’ పాటలకు కీరవాణి స్వరపరచిన బాణీలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయయి. వాటిలో నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకుకుని తెలుగువారికి మరింత గౌరవం దక్కేలా చేశారు. చివరిగా లవ్ మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన హరిహర వీరమల్లు, విశ్వంభర సినిమాల మ్యూజిక్ తో బిజీగా ఉన్నారు.

(జూలై 4న ఎం.ఎం.కీరవాణి పుట్టినరోజు)