Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఫాలోతో వైరల్

Dating Rumours (2)

Dating Rumours (2)

Dating Rumours: మృణాల్ ఠాకూర్, భారత క్రికెటర్ రిషబ్ పంత్ కు చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం ప్రారంభించడంతో, వారిద్దరి మధ్య ఏదైనా కథ నడుస్తుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, రిషబ్ పంత్ తన సోదరి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండో మహిళ మృణాల్ ఠాకూర్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇద్దరి ఫాలోయింగ్ లిస్టుల స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో, ఈ చిన్న పరిణామాన్నే కొందరు డేటింగ్ వార్తలుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆఫీషియల్ గా వీళ్ళు ఎలాంటి ప్రకటన చేయనప్పటకీ, అభిమానులు మాత్రం తమదైన ఊహాగానాలతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రిషబ్ పంత్ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నటి ఊర్వశి రౌతేలాతో ఆయన పేరు తరచూ ముడిపడింది. అయితే ఆ వార్తలను ఊర్వశి ఖండిస్తూ, తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని వెల్లడించారు. ఆ తర్వాత ఆ వదంతులకు ముగింపు పలికినట్లే అయింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ కూడా గతంలో నటుడు ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారాన్ని ఎదుర్కొన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే అలాంటి వార్తలపై మృణాల్ నవ్వుతూ స్పందించగా, ధనుష్ కూడా ఎప్పుడూ వాటిని ధృవీకరించలేదు. అనంతరం వారిద్దరూ విడిపోయారనే ప్రచారం కూడా జరిగినా, ఆ విషయంపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్, రిషబ్ పంత్ విషయంలో కూడా పరిస్థితి ఇదే. ఇప్పటివరకు బయటకు వచ్చిన ఏకైక విషయం ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడమే. అది స్నేహానికి సంకేతమా, పరిచయమా, లేక కేవలం సోషల్ మీడియా ఫాలోనా, మరేదైనా ఉందా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ సోషల్ మీడియా మాత్రం వారిద్దరి చుట్టూ ఒక కొత్త ప్రేమకథను సృష్టించేసింది.