మోహన్ బాబు కు కోపం ఎక్కువ. ఇది అందరూ చెప్పే మాట. అయితే ఆయనకు కోపం ఎందుకొస్తుంది? ఎప్పుడొస్తుంది? అనేది మాత్రం ఆయనతో పనిచేసిన వారికి, సన్నిహితులకు మాత్రమే తెలిసిన సత్యం. సమయపాలన, క్రమశిక్షణ అంటే ప్రాణం పెట్టే మోహన్ బాబు… దానిని పాటించని వారి పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఎంతమంది ముందు అయినా వారిని గట్టిగా మందలిస్తారు. దాంతో ఆయన ఆగ్రహం హైలైట్ అవుతుంది తప్పితే, దాని వెనుక కారణం కాదు. ఇదిలా ఉంటే… నటుడిగా ఐదు వందలకు పైగా చిత్రాలలో నటించి, కలెక్షన్ కింగ్ అనిపించుకున్న మోహన్ బాబు కెరీర్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైంది. చిత్రం ఏమంటే… చిత్రసీమలోకి అడుగుపెట్టి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఆయన ఇంతవరకూ మెగా ఫోన్ జోలికి పోలేదు.
Read Also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్
ఆ విషయం గురించి ఆయన్ని ఎన్ని సార్లు అడిగినా, ‘నా కోపం సంగతి తెలిసిందే కదా! ఆవేశంలో ఎవరినైనా ఏదైనా అనేస్తాను. దాంతో వాళ్ళు అలిగి, షూటింగ్ కు రాకపోతే, మూవీ మధ్యలో ఆగిపోతుంది! అందుకే డైరెక్షన్ జోలికి పోదల్చుకోలేదు’ అని చెబుతుండేవారు. కానీ ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనే కోరిక మోహన్ బాబులో బలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. తాను డైరెక్షన్ చేయడం కోసం ఓ కథను మోహన్ బాబు సిద్దం చేసుకున్నారట. కానీ అది ఎప్పుడు తెరకెక్కించేది మాత్రం ఆయన చెప్పడం లేదు. మొత్తానికి మోహన్ బాబు మెగా ఫోన్ పట్టడం అయితే ఖాయమని అంటున్నారు. ఆ మధ్య వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’లో ఎయిర్ ఫోర్స్ అధికారిగా నటించిన మోహన్ బాబు ఇప్పుడు హీరోగా ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ తెరకెక్కుతోంది.
