Site icon NTV Telugu

Mohan Babu: భక్తవత్సలం నాయుడు టూ మోహన్ బాబు.. 48 ఏళ్ల నట ప్రస్థానం వేరే లెవెల్ అంతే

Mohan Babu

Mohan Babu

Mohan Babu: విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు సినిమా రంగంలోకి వచ్చి 48 ఏళ్లు అవుతోంది. నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారు. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. ఈ 48 ఏళ్ల నట జీవితంలో..

కెరీర్ ఆరంభంలో అడ్డంకులు..

భక్తవత్సలం నాయుడు కాస్త తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి మోహన్ బాబుగా మారారు. 70వ దశకంలో ఆయన నట ప్రస్థానం మొదలైంది. ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన అకుంఠిత భావం, కష్టపడే తత్త్వం, అంకిత భావంతో కష్టపడి ఎదిగారు. ఆయన నాడు వేసిన పునాదులపై మంచు వారి ఘనత చెక్కు చెదరని భవనంలా నిలబడింది.

నటుడిగా ఎదిగిన తీరు..

మోహన్ బాబు తనదైన రీతో డైలాగ్స్ చెప్పడం, విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం, విలనిజంలో కొత్తదనం చూపించడంతో అతి కొద్ది కాలంలోనే తెలుగులో స్టార్‌గా ఎదిగారు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. పాత్రలకు ప్రాణం పోయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన చేసిన కారెక్టర్‌లు తెలుగు వారి మదిలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.

నిర్మాతగా తిరుగులేని వ్యక్తి..

సినిమా పరిశ్రమ మీదున్న మక్కువతో ఆయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కెమెరా ముందు నటించి ఎన్నో విజయాలు అందుకున్న మోహన్ బాబు.. నిర్మాతగా అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.

ఆయన కెరీర్‌లోని రికార్డులు..

మోహన్ బాబు ఖాతాలో ఎప్పటికీ చెరిగినిపోని రికార్డులున్నాయి. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా.. మోహన్ బాబుని విలక్షణ నటుడిగా నిలబెట్టేశాయి.

నటనలో విలక్షణకు మారుపేరు..

నా రూటే వేరు అంటూ మోహన్ బాబు చెప్పిన ఐకానిక్ డైలాగ్స్, మ్యానరిజం తెలుగు ప్రేక్షుకలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన డైలాగ్స్, మ్యానరిజంకు ప్రత్యేక అభిమాన గణం ఉంటుంది. ఆయనలా విలక్షణంగా నటించేవారు ఉండటం చాలా అరుదు.

ఐదు దశాబ్దాలకు దగ్గరగా..

మోహన్ బాబు చిత్ర పరిశ్రమలో నటుడిగా 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పట్టుదల, అంకితభావం అందరికీ నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆయన నవతరానికి స్పూర్తిగానే నిలుస్తున్నారు. నటుడిగా ఐదు దశాబ్దాలకు దగ్గర పడుతున్నా.. ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన చేయబోయే తదుపరి చిత్రాలు, రాబోయే అద్భుతాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్, ‘పద్మశ్రీ’ అవార్డులు వరించాయన్న సంగతి తెలిసిందే.

Exit mobile version