ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. సిరివెన్నెల అంత్యక్రియలకు టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సిరివెన్నెలను కడసారి చూసి సంతాపం తెలిపారు. అయితే ఆరోజు ఎక్కడా మోహన్ బాబు ఫ్యామిలీ కనిపించలేదు.. దీంతో మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదు అని అభిమానుల్లో అనుమానం వ్యక్తం అయ్యింది. ఇక తాజాగా సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎందుకు రాలేదో మోహన్ బాబు తెలిపారు.
తాజాగా ‘రుద్రంకోట’ సినిమా కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు సిరివెన్నెల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” సిరివెన్నెల మరణంతో ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.. మా ఇంట్లో నా తమ్ముడు మృతిచెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెల్ళకూడదు.. అందుకే సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పా.. ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన ఆయనను కొద్దిరోజుల్లో ఇండస్ట్రీ మర్చిపోతుంది.. కానీ, ఆయన రాసిన పాటలు ముందుతరాల వారు కూడా వింటారు. ఆయన ఎక్కడ ఉన్నా సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. గత కొన్నిరోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతుండడం మనసును కలిచివేస్తోంది” అని చెప్పుకొచ్చారు.