రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ అంటే రైతులకు ఎంతో ఇష్టం. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటారు. ఈ ఏడాది నేడు అనగా జనవరి 13న భోగి పండుగను ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకుంటారు. ఊరూరా, పల్లె పల్లెనా తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు కాలుస్తున్నారు. ఇలాంటి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ముఖ్యంగా పిండి వంటలు, చుట్టాలతో ప్రతి ఒక ఇల్లు ఎంతో సందడిగా ఉంటుంది.
ఇక సెలబ్రెటిలు కూడా ఈ సంక్రాంతిని ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో వారి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా కోలివుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు..‘ పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉంటూ, మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిద్దాం పాటిద్దాం. పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు. అందుకే వారి మాటకు గౌరవం ఇస్తు మన సంప్రదాయాలను కాపాడుకుందాం. ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. జరిగిన కాలాన్ని మర్చిపోండి..జరగబోయే కాలం గురించి ఆలోచించండి. ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి కరువు కాటకాలు రాకూడదని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జల్లికట్టు పోటీల్లో పాల్గొనే యువకులు జాగ్రత్తగా ఉండండి’ అంటూ తెలిపారు.