NTV Telugu Site icon

Rubal Shekhawat: మొదటిదేమైందో తెలియదు… రెండో దానికి రెడీ!

Rubal

Rubal

Ey Pilla: అందాల భామలుగా కిరీటి ధారణ జరుపుకున్నంత మాత్రాన సినిమా అవకాశాలు వచ్చేస్తాయని అనుకోలేం. ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, ప్రియాంక చోప్రా వంటి కొద్దిమంది మాత్రమే స్టార్ హీరోయిన్స్ కాగలరు. అయితే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఏదో ఒక కేటగిరిలో అగ్రస్థానంలో నిలిచిన వాళ్ళు వాణిజ్య ప్రకటనల్లో బాగానే చోటు దక్కించుకుంటూ ఉంటారు. గత యేడాది మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన రుబల్ షెకావత్ కు అలానే కమర్షియల్స్ లో నటించే ఛాన్స్ దక్కింది. రాజస్థాన్ కు చెందిన రుబల్ ముగ్గురమ్మాయిలలో చివరిది. అక్కల ప్రోత్సాహంతో పాటు తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగ పర్చుకుని ఫెమినా అందాల పోటీల్లో పాల్గొంది. రన్నరప్ గా నిలిచింది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన రుబల్ కు నటన అంటే ఇష్టం. అందుకే జైపూర్ నుండి తన మకాం ముంబైకు మార్చింది. అక్కడకు వెళ్ళగానే ఆమెకు రణవీర్ సింగ్ తో కలిసి ఓ కమర్షియల్ లో నటిచే ఛాన్స్, ఇమ్రాన్ తో కలిసి ఓ పాటలో నర్తించే అవకాశం లభించాయి. చిన్నప్పటి నుండీ షారుఖ్ ఖాన్ అభిమాని అయిన రుబల్ ఎప్పటికైనా అతనితో కలిసి వర్క్ చేస్తానని కలలు కంటోంది.

ఇదిలా ఉంటే… గత యేడాది ఆగస్ట్ లో రుబల్ షెకావత్ కు తెలుగులో ఓ సినిమా ఛాన్స్ లభించింది. అవకాశాల కోసం చెకోర పక్షిలా ఎదురుచూస్తున్న అమ్మడు దాన్ని ఠక్కున క్యాచ్ చేసింది. మాస్ మహరాజా రవితేజ సోదరుడు రఘు కొన్ని సినిమాలలో నటించాడు. అతని కొడుకు మాధవ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మాధవ్ తో ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి (శ్రీనివాస్) ‘ఏయ్ పిల్లా’ అనే ఈ మూవీని ప్లాన్ చేశారు. రమేశ్ వర్మ కథను అందించిన ఈ మూవీతో లూధిర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్ట్ లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. కానీ ఆ తర్వాత ప్రోగ్రెస్ ఏమిటో తెలియ రాలేదు. రుబల్ తొలి తెలుగు సినిమా పరిస్థితి ఇలా ఉంటే, తాజాగా ఆమెకు మరో ఛాన్స్ లభించింది. త్రిగుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘అవసరానికో అబద్దం’లో రుబల్ హీరోయిన్ గా బెర్త్ కన్ ఫామ్ చేసుకుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారమే మొదలైంది. అందం విషయంలో వంక పెట్టడానికి లేని రుబల్ కు ఇలా బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు రావడం సహజం. బట్ ఆ సినిమాలు జనం ముందుకు వచ్చి, ఆమెకు నటిగా మంచి మార్కులు పడితే తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోగలదు. చూద్దాం… ఏం జరుగుతుందో!!

Show comments