Mirzapur The Movie: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజ్ ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై కూడా తన సత్తా చూపిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు తదితరులు నటించిన ‘మిర్జాపూర్ ది మూవీ’ (Mirzapur: The Movie) సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉండగా, సినిమా మొదటి మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు సాధించింది. తొలి రోజు నుంచే సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చింది. రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి. ఇక ఆదివారం సెలవు కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 96.85 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయింది. వంద కోట్లకు అడుగు దూరంలో మాత్రమే ఉంది.
పంకజ్ త్రిపాఠి పోషించిన కాలీన్ భయ్యా పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలీ ఫజల్ గుడ్డు పండిట్‌గా, దివ్యేందు మున్నా పాత్రలో మరోసారి కనిపించడంతో ‘మిర్జాపూర్’ సిరీస్ అభిమానులకు థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా రూ.100 కోట్ల నెట్ మార్కును ఈ రోజు అందుకోబోతోంది. ప్రస్తుతం ‘మిర్జాపూర్ ది మూవీ’ దూకుడు చూస్తుంటే ఈ ఫీట్ పెద్ద కష్టంగా కనిపించడం లేదు. మరి సోమవారం నుంచి సినిమా ఎంతవరకు తన జోరు కొనసాగిస్తుందో చూడాలి.
ఇక ‘మిర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) తెలుగు వెర్షన్ మాత్రం నిరాశాజనకంగా సాగుతోంది. ఇది మొదటి మూడు రోజుల్లో కేవలం రూ. 84 లక్షల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లు తెలుగు మార్కెట్‌లో చాలా బలహీనంగా జరగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ తెలుగు ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లకపోవడం వల్ల, థియేటర్ల వద్ద ఈ వెర్షన్‌కు కనీస బజ్ కూడా ఏర్పడలేదు. దీనికి తోడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను చాలా లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే విడుదల చేశారు. దీంతో తెలుగు వెర్షన్ వసూళ్లు మరింత స్లోగా మారాయి.

