Megastar Chiranjeevi: సినిమా పిచ్చోళ్లకు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి. తమ అభిమాన హీరో సినిమాను మొదటిరోజు మొదటి షో చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. దానికోసం ఎన్నో కష్టాలు కూడా పడతారు. అయితే ఆ జ్ఞాపకాలను ఇప్పుడు గుర్తుతెచ్చుకొంటే మాత్రం సంబరపడిపోతుంటారు. తాజాగా చిరంజీవి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు ఎక్కడా, ఎవ్వరి ముందు చెప్పని ఒక సీక్రెట్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పంచుకున్నారు. అందరికి మీ సినిమానే ఫస్ట్ డే ఫస్ట్ షో చూశామని చెప్తుంటారు.. మీకు ఉన్న ఫస్ట్ డే ఫస్ట్ షో మూమెంట్ ను చెప్పమని సుమ అడుగగా చిరు మాట్లాడుతూ “ఈ విషయం నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. నాకు చెప్పుకోవాలి అని ఉన్నా పరువు పోతుందని చెప్పను. నా ఫేవరేట్ హీరో రామారావు గారు. ఆయన నటించిన రాము సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్లాను. టికెట్స్ తీసుకోమని నన్ను పంపించి వాళ్లు వెళ్లిపోయారు. నాతో పాటు నాగబాబును తీసుకెళ్ళాను. అప్పటికీ అతను చాలా చిన్నవాడు. ఆ టికెట్స్ కోసం నిలబడి, కొట్టుకొంటున్నారు. అందులో నాగబాబును నలిపేశారు. ఇక ఏదో విధంగా టికెట్స్ తీసుకొని వెళ్ళడానికి బయలుదేరాం.
అక్కడ ట్విస్ట్ ఏంటంటే.. దానికి ముందు షో వదలగానే మా నాన్న గారు, వెనుక అమ్మ బయటికి వచ్చి మమ్మల్ని చూసారు. పాపం నాగబాబు బేలగా ముఖం పెట్టాడు. ఇక ఇంటికి వెళ్ళాక మా నాన్న కొబ్బరి మట్ట పట్టుకొని సినిమాకు ఎలా వచ్చావు అని అడిగారు. నేను అంటే నాన్న.. మీరు అమ్మ సినిమాకు వెళ్లారని తెలిసి వచ్చామని చెప్పాను. వెళ్తే వెళ్ళావ్ కానీ నేల టికెట్ తీసుకొని అక్కడ ఉంటే తమ్ముడును తొక్కేస్తే ఏంటీ పరిస్థితి అని అడిగారు. ఇక మీరు నమ్మరు. మా బంధువుల ఇళ్లన్నీ దాటుకొని ఉన్న వీధి వరకు నన్ను నాన్న ఉరికించి కొట్టారు. ఆయనకు కోపం వస్తే అస్సలు ఆపలేము. అది నా ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం. అది ఇప్పుడు తలచుకొంటే సంతోషంగా ఉన్నా ఏవిఎం రాము అంటే చాలు వణుకు వచ్చేస్తోంది” అని చెప్పుకొచ్చారు.