Site icon NTV Telugu

Tillu Square: టిల్లు గాడు మెగాస్టార్‌కి పిచ్చపిచ్చగా నచ్చేశాడు!

Chiranjeevi Tillu

Chiranjeevi Tillu

Megastar Chiranjeevi appreciates Siddhu Jonnalagadda after watching Tillu Square: పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవిచేత ప్రశంసలు అందుకోవడం అంటే, యువ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డు గెలుచుకోవడం లాంటిదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ సినిమా యూనిట్ ఆ ఘనతను సాధించింది. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించగా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనం సృష్టిస్తోంది.

Vijay Deverakonda: దిల్ రాజు బ్యానర్‌లో ఆడిషన్‌కి వెళ్తే రిజక్ట్ చేశారు.. మస్తు హర్టయ్యా!

కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ‘టిల్లు స్క్వేర్’ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమ యూనిట్ మొత్తాన్ని తన నివాసానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించినట్టు యూనిట్ వెల్లడించింది. ‘డీజే టిల్లు’ తనకు బాగా నచ్చిన చిత్రమని, ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ కూడా ఎంతగానో నచ్చిందని చెప్పిన చిరంజీవి, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారని వెల్లడించారు. “డీజే టిల్లు నాకు బాగా నచ్చిన సినిమా, ఆ సినిమా చూసి ముచ్చటేసి, సిద్ధుని ఇంటికి పిలిపించుకొని అభినందించా. సిద్ధుని ఇంట్లో అందరూ ఇష్టపడతారు, తాజాగా ఈ ‘టిల్లు స్క్వేర్’ సినిమాను చూశా, అద్భుతం.. నాకు చాలా నచ్చింది.

మొదటి సినిమా హిట్ అయ్యి, దానికి సీక్వెల్ చేస్తే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి, ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు కానీ సిద్ధు, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీ మరియు మిగతా టీం అంతా కలిసి ప్రేక్షకులు మెచ్చేలా సీక్వెల్ ని అందించడంలో విజయం సాధించారు. అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వులతోటి ఈ ‘టిల్లు స్క్వేర్’ని ఎంతో ఎంజాయ్ చేశా, ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాము, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో అని సిద్ధు నాతో చెప్పాడు, దీని వెనుక దర్శకుడు మల్లిక్ రామ్, ఎడిటర్ నవీన్ నూలి సహా అందరి సమిష్టి కృషి ఉందని తెలిపాడు అని అన్నారు. నటుడిగా, కథకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణమైన సిద్ధు జొన్నలగడ్డని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, అలాగే దర్శకుడు మల్లిక్, నిర్మాత వంశీ, ఎడిటర్ నవీన్ ని అభినందిస్తున్నా, ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడగల బలమున్న మనిషి వంశీ.

మంచి సినిమాలను నిర్మిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉత్తమ యువ నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు వంశీ. అలాగే ‘మ్యాడ్’ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న కళ్యాణ్.. ఈ సినిమా రచనలో సహకారం అందించాడని తెలిసి ‘టిల్లు స్క్వేర్’ చిత్ర బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సినిమా యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన అని కొందరు అంటున్నా, కానీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా, నేను ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా, మీరు కూడా ఈ సినిమాకి ఎంజాయ్ చేయండి.” అంటూ చిరంజీవి చెప్పిన మాటలు చిత్ర బృందాన్ని ఉత్సాహంలో నింపాయని వెల్లడించారు.

Exit mobile version