Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి భారతీయ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపారు. ఇప్పటికే పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న ఈ దిగ్గజ నటుడు, ఇప్పుడు తన కెరీర్‌లో నాలుగో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘బ్రమయుగం’ చిత్రంలోని అసాధారణ నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన మమ్ముట్టి, ‘చందు ఛాంపియన్’ చిత్రానికి గాను ఎంపికైన బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఈ అవార్డును పంచుకున్నారు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
2026 జూన్ 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న మమ్ముట్టికి, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో అత్యున్నత గౌరవం లభించడం విశేషం. ఐదు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు. ఈ నాలుగో జాతీయ అవార్డుతో మమ్ముట్టి మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నారు.
ఈ విజయంపై స్పందించిన కమల్ హాసన్ తనదైన స్టైల్ లో స్పందించారు. ఒకప్పుడు జాతీయ అవార్డుల సంఖ్యలో తనను అధిగమిస్తానని మమ్ముట్టి చెప్పారని గుర్తు చేసిన కమల్, ‘ఎప్పటిలాగే నువ్వు మాట నిలబెట్టుకున్నావు. ఇంకా మరెన్నో పురస్కారాలు అందుకోవాలి మిత్రమా’ అంటూ హృదయపూర్వకంగా అభినందించారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, మమ్ముట్టి చెరో మూడు జాతీయ అవార్డులతో సమంగా ఉండగా, ఇప్పుడు నాలుగో అవార్డుతో మమ్ముట్టి ముందంజలో నిలిచారు.
మోహన్‌లాల్ కూడా తన చిరకాల మిత్రుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. పూర్తిగా అర్హతతో వచ్చిన గుర్తింపు’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మమ్ముట్టి విజయాన్ని ప్రశంసించారు. చిరంజీవి దీనిని అసాధారణమైన ఘనతగా అభివర్ణించగా, బన్నీ కూడా ప్రత్యేక సందేశంతో తన అభినందనలు తెలియజేశారు.
ఇక మమ్ముట్టి జాతీయ అవార్డుల ప్రయాణం కూడా చాలా గొప్పగా సాగింది.1990లో ‘ఒరు వడక్క వీరగాథ’, ‘మథిలుకల్’ చిత్రాలకు, 1994లో ‘విధేయన్’, ‘పొంతన్ మాడ’ చిత్రాలకు, 1999లో ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ‘బ్రమయుగం’తో నాలుగోసారి ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో అత్యధిక జాతీయ ఉత్తమ నటుడి అవార్డులు అందుకున్న నటుల జాబితాలో అమితాబ్ బచ్చన్ సరసన నాలుగు విజయాలతో సమానంగా నిలిచారు.
జాతీయ అవార్డులతో పాటు మమ్ముట్టి తన కెరీర్‌లో పదకొండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, పదిహేను ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పదకొండు కేరళ సినీ విమర్శకుల పురస్కారాలను కూడా అందుకున్నారు. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ తన ప్రత్యేకమైన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగానూ విజయవంతంగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం మమ్ముట్టి చేతిలో కూడా ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్‌తో ‘పాదయాత్ర’ చిత్రంలో మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. అలాగే జాతీయ అవార్డు గ్రహీత ధనుష్‌తో కలిసి రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ‘ఓం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నాలుగో జాతీయ అవార్డుతో మమ్ముట్టి మరోసారి తన నటనా ప్రస్థానానికి కొత్త చరిత్రను తిరగరాశారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

