మహేష్ బాబు హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒక్కడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకి మాస్ లో ఒక క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. అయితే, తాజాగా ఈ సినిమా గురించి గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నిజానికి ఆ సినిమాలో మహేష్ బాబు, పాస్‌పోర్ట్ ఆఫీసర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఫోన్ కాల్స్ ద్వారా టీజ్ చేసే ఓ సీన్ ఉంటుంది. అయితే, అలా టీజ్ చేసేలా సీన్ రాసుకున్నాక ఒక ఫోన్ నెంబర్ ఏదైనా పెడితే బాగుంటుందని అనుకున్నామని, కానీ మహేష్ బాబు వచ్చి ఎమ్మెస్ రాజు నెంబర్ పెట్టమని అన్నారని చెప్పుకొచ్చారు.
Also Read :Ram Charan : ఎన్టీఆర్ డ్రైవింగ్ అంటే చాలా భయం.. రాం చరణ్ షాకింగ్ కామెంట్స్
“ఆ నెంబర్ పెడితే ఆయనకి మాత మోగిపోద్ది, ఎందుకు అవసరమా?” అని అడిగితే, “పర్లేదు పెట్టండి” అని నా చేత ఫోన్ నెంబర్ పెట్టించాడని ఈ సందర్భంగా గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగానే నిర్మాతకు ఫోన్ కాల్స్ తో మాత మోగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ సీన్ లో మహేష్ స్నేహితుడు అయిన ఓ పాత్ర ‘లడ్డు’ అని ఉంటుంది. ఆ పాత్ర పేరుతోనే పిలుస్తూ “ఏరా లడ్డు” అంటూ ఎమ్మెస్ రాజు గారికి ఫోన్లు చేసేవారు అని చెప్పుకొచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ కాల్స్ భరించారు కానీ, ఒకవేళ తేడా పడి ఉంటే రాజుగారికి ఇంకా ఇబ్బంది అయ్యేది అంటూ ఈ సందర్భంగా గుణశేఖర్ చెప్పుకొచ్చారు. గుణశేఖర్ త్వరలోనే ‘యుఫోరియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.
